Medicine From Sky: మెడిసిన్‌ ఫ్రమ్‌ స్కైకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం

Medicine From Sky: వికారాబాద్‌లో ప్రారంభించనున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా

Update: 2021-09-11 03:35 GMT
మెడిసిన్ ఫ్రామ్ స్కై (ఫైల్ ఇమేజ్)

Medicine From Sky: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేసే రాష్ట్రంగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభానికి వికారాబాద్‌ వేదికైంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు మెడిసిన్‌ ఫ్రమ్‌ స్కై తో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. వికారాబాద్‌లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నెల రోజుల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. డ్రోన్లు ఎంత దూరం ప్రయాణించగలుగుతాయి. ఎంత బరువును మోసుకెళ్తాయనే అంశాలను పరిశీలించనున్నారు.

రవాణా వ్యవస్థ సరిగాలేని ప్రాంతాలకు ఈ మెడిసిన్ ఫ్రమ్‌ స్కై ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో టీకాలు, యాంటీవీనమ్‌ వంటి మందులు సకాలంలో ఆస్పత్రులకు చేరవేసేలా డ్రోన్లు ఎంతగానో సహాయపడతాయని అంటున్నారు. వీటి ద్వారా అవయవాలను కూడా చేరవేసే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనిని వికారాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రాజెక్టు కోసం ఐటీ శాఖ.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పనిచేస్తున్నది.

Tags:    

Similar News