కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్.. ఉ.11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదు
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రముఖులు, అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, పలు పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రముఖులు, అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, పలు పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లారెడ్డిగూడలో ఓటేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన కుటుంబంతో పాటు యూసుఫ్‌గూడలో ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి నాగార్జున కమిటీ హాల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దంపతులు షేక్‌పేట్ పోలింగ్ బూత్‌లో ఓటేశారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి యూసుఫ్‌గూడ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు నెలకొన్నాయి. బోరబండలోని ఓ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్... బీఆర్‌ఎస్ కార్యకర్తపై దాడి చేశారు. పోలింగ్ బూత్ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
ఈ దాడిని బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అంతేకాక, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారంటూ మండిపడ్డారు. పోలింగ్ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని, ఓటర్లు భయపడకుండా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేయాలని ఆమె పిలుపునిచ్చారు.
షేక్‌పేట్ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. కాంగ్రెస్ నేత సాయినాథ్ అలియాస్ లడ్డూతో పాటు మరో నలుగురు కలిసి బీజేపీ నేతలు బయట తిరగొద్దంటూ స్వస్తిక్‌పై దాడిచేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్, కాంగ్రెస్ నేతలపై ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు, బీఆర్‌ఎస్ అభ్యర్థి మధ్య వాగ్వాదం:
పోలింగ్ బూత్‌లలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రాకను పోలీసులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆమెను కోరడంతో, పోలీసుల తీరుపై మాగంటి సునీత తీవ్రంగా ఫైర్ అయ్యారు.
పోలీసులు - ఏజెంట్ల మధ్య వాగ్వాదం:
వాలి స్కూల్‌లోని పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దఎత్తున ఏజెంట్లు గుమిగూడటంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.