Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 4లక్షల 13 వందల 65 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2 లక్షల 8వేల 561 మంది పురుషులు, లక్షా 92వేల 779 మంది మహిళలు ఉన్నారు. 25 మంది ఇతరులు ఉన్నారు. 139 భవనాల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్‌లో 986 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 9వ పోలింగ్ స్టేషన్‌లో అత్యధికంగా 12 వందల 33 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నంబర్ 263లో 540 మంది ఓటర్లు ఉన్నారు. 11 పోలింగ్ కేంద్రాల్లో 12 వందల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో నిలిచారు. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ పోటీ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఒక కంట్రోల్ యూనిట్‌తో పాటు.. 4 EVM లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. అక్కడ కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా.. 5వేల మంది పోలీసులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా 144 సెక్షన్ విధించారు. ఇప్పటివరకు 230 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇక.. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 2 వేల 60 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, మైక్రో ఆబ్జర్వర్లు, సాంకేతిక సిబ్బంది సహా సమగ్ర ఏర్పాట్లు చేశారు.