రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్... వాట్ నెక్స్ట్?

మే 21 రేవ్ పార్టీపై బెంగుళూరు సిపి బి.దయానంద మీడియాకు వివరాలు అందజేసే సమయంలో చికెన్ బిర్యానీ చేస్తున్న వీడియోను హేమ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఉందని బెంగుళూరు సిపి దయానంద ప్రకటించారు.

Update: 2024-06-03 15:45 GMT

రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్... వాట్ నెక్స్ట్?

రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పుడు ప్రచారం సాగుతుందని వీడియోలు రిలీజ్ చేసిన హేమ... చివరకు ఈ కేసులో అరెస్టయ్యారు. ఈ రేవ్ నిర్వహణలో హేమ కీలకంగా వ్యవహరించారని బెంగుళూరు పోలీసులు గుర్తించారు. గతనెల 20న బెంగుళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. టాలీవుడ్ నటి హేమ ఈ రేవ్ పార్టీలో పోలీసులకు చిక్కారు. అయితే ఈ సమయంలో పోలీసులకు హేమ తనపేరు క్రిష్ణవేణిగా చెప్పారు.

బెంగుళూరు రేవ్ పార్టీలో తాను ఉన్నట్టుగా తప్పుడు ప్రచారం సాగుతుందని... తాను హైద్రాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నానని హేమ సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి ఫోటోలను బెంగుళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో, హేమ వీడియో రిలీజ్ చేసిన సమయంలో ఒకే డ్రెస్ లో ఉంది. రేవ్ పార్టీలో తాను లేనని నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో రిలీజ్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మే 21 రేవ్ పార్టీపై బెంగుళూరు సిపి బి.దయానంద మీడియాకు వివరాలు అందజేసే సమయంలో చికెన్ బిర్యానీ చేస్తున్న వీడియోను హేమ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఉందని బెంగుళూరు సిపి దయానంద ప్రకటించారు. హేమ విడుదల చేసిన చికెన్ బిర్యానీ వీడియోపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. రేవ్ పార్టీలో తాను లేనని చెప్పుకొనేందుకు కష్టపడుతున్నారని హేమపై సెటైర్లు వేశారు నెటిజన్లు.

హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు

బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్, మత్తు పదార్ధాలను పోలీసులు సీజ్ చేశారు. తాము దాడి చేసే సమయంలో కొందరు చెట్ల పొదల్లోకి, వాష్ రూమ్ ల్లో డ్రగ్స్ ను విసిరేశారని పోలీసులు చెప్పారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తే 86 మంది డ్రగ్స్ వాడినట్టుగా తేలింది. రేవ్ పార్టీకి హాజరైన వారిలో 73 మంది పురుషుల్లో 59 మంది, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చింది. సినీ నటి హేమ బ్లడ్ శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లున్నట్టుగా రిపోర్ట్ తెలిపింది.

విచారణకు హజరుకాని హేమ.. అరెస్ట్

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హజరు కావాలని హేమకు బెంగుళూరు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపారు. కానీ, ఆమె విచారణకు హజరు కాలేదు. విచారణకు హజరుకావాలని బెంగుళూరు పోలీసులు పంపిన నోటీసుకు విచారణకు రాలేనని గత నెల 27న హేమ సమాధానం పంపారు. వైరల్ ఫీవర్ కారణంగానే విచారణకు హజరుకాలేకపోతున్నట్టుగా ఆమె ఆ లేఖలో వివరించారు. వారం రోజుల పాటు తనకు గడువివ్వాలని కోరారు. అయితే జూన్ 1న విచారణకు రావాలని హేమకు మరో నోటీసు పంపారు పోలీసులు. రెండోసారి నోటీసు వచ్చినా ఆమె విచారణకు వెళ్లలేదు. ఇవాళ హైద్రాబాద్ కు వచ్చిన బెంగుళూరు పోలీసులు ఆమెను విచారించారు. అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ నుండి ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్లారు. రేపు కోర్టులో హజరుపర్చనున్నారు.

హేమ అరెస్ట్.. వాట్ నెక్స్ట్

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో హేమకు లోయర్ కోర్టులో బెయిల్ సులభంగానే వస్తుందని లాయర్లు చెబుతున్నారు. ఎన్ డీ పీఎస్ యాక్ట్ 1985 లోని వెసులుబాటును ఉపయోగించుకొని కొందరు డ్రగ్స్ కేసులో తాము బాధితులమని కేసుల నుండి బయటపడే పరిస్థితులు లేకపోలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్రగ్స్ కు తాము బానిసలుగా మారినందునే తీసుకున్నామని... అందుకే డ్రగ్స్ వ్యసనం నుండి తమను తాము బయటపడేందుకు అవసరమైన చికిత్స తీసుకొంటామని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అందుకు కోర్టులు అనుమతులు ఇస్తాయి. డ్రగ్స్ కు చికిత్స కోసం డీ ఎడిక్షన్ సెంటర్ కు వెళ్లి చికిత్స తీసుకోవాలని కోర్టు వారికి అనుమతిని ఇవ్వవచ్చు.నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ యాక్ట్ 1985 సెక్షన్ 20బి కింద డ్రగ్స్ కొనుగోలు చేయడం ఉత్పత్తి చేయడం, అమ్మటం, రవాణా చేయడం, తమ వద్ద ఉంచుకోవడం నేరం. ఈ చట్టానికి 1988లో సవరణ చేశారు. ఈ సవరణ మేరకు డ్రగ్స్ ను వ్యక్తిగతంగా వినియోగానికి శిక్షను తగ్గించారు. గతంలో డ్రగ్స్ కేసులు దుర్వినియోగమైన ఉదంతాలు ఉండడంతో చట్టసవరణ చేశారు. ఎన్ డీ పీఎస్ యాక్ట్ ప్రకారంగా డ్రగ్స్ వాడితే ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20 వేల ఫైన్ విధిస్తారు. అయితే ఎంత మోతాదులో డ్రగ్స్ వాడిన దాని బట్టి శిక్షలు మారుతాయి. ఒకసారి శిక్ష పడితే అదే నేరానికి పాల్పడితే ఒకటిన్నర రెట్ల శిక్ష, ఫైన్ విధిస్తారు.

Tags:    

Similar News