HYDRA: ఆ భూముల్లో ప్లాట్లు కొనొద్దు... హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
HYDRA: ప్లాట్లు కొనుగోలు చేసేవారికి హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో జరుగుతున్న స్థలాల కొనుగోళ్లపై హైడ్రాకమిషనర్ ఏ.వి. రంగనాథ్ సోమవారం కీలక ప్రకటన చేశారు. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికాకూడదని ఆయన ప్రజలకు సూచించారు. నగరంలో హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆ విషయమై ఫిర్యాదు అందింది. రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలోని 50వ సర్వే నెంబర్ లోని ఎకరం రెండు గుంటల భూమిని ఫామ్ ల్యాండ్ పేరుతో ప్లాట్లుగా అమ్ముతున్నారని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.
ఆ మేరకు కమిషనర్ రంగనాథ్ వివరాలను ఆరాతీశారు. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని లే అవుట్ ను డెవలప్ చేస్తే..సర్కార్ కు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. అలా అమ్మాలంటే గజాల్లో కాకుండా కనీసం అర ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలని 2018లోనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అయినా కొంతమంది అధికారులు పట్టించుకోవడం లేదు. అలాంటి వారిపై సంస్థలపై చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. అలాగే జీవో నెంబర్ 131 ప్రకారం 31.8.2020 తేదీ తర్వాత అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరు చేయట్లేదు. అనుమతి లేకుండా కడితే కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచనలు చేశారు.