Hyderabad–Vijayawada Highway: సంక్రాంతి రద్దీతో కిక్కిరిసిన హైదరాబాద్–విజయవాడ హైవే.. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు

Hyderabad Vijayawada Highway:హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నారా?.. హైవేపై ట్రాఫిక్ రద్దీ, ఈ మార్గాలు బెస్ట్ అంటున్న పోలీసులు

Update: 2026-01-10 09:12 GMT

Hyderabad–Vijayawada Highway: సంక్రాంతి రద్దీతో కిక్కిరిసిన హైదరాబాద్–విజయవాడ హైవే.. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు

Hyderabad Vijayawada Highway : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65) పూర్తిగా కిక్కిరిసిపోయింది. శనివారం ఉదయం నుంచే వాహనాలు బారులుగా నిలవడంతో హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం, పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పండుగ సెలవులు ఒకేసారి ప్రారంభమవడంతో పాటు హైవేపై కొనసాగుతున్న నిర్మాణ పనులు కూడా రద్దీకి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లేవారు విజయవాడ హైవేకు బదులుగా నాగార్జునసాగర్ హైవే మీదుగా ప్రయాణించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నుంచి బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేలోకి వెళ్లితే, దూరం కొద్దిగా ఎక్కువైనా ట్రాఫిక్ సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణించవచ్చని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద తీవ్ర జామ్ ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు భువనగిరి మీదుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ఘట్‌కేసర్ ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేపై చేరి, అక్కడి నుంచి భువనగిరి–రామన్నపేట మార్గంగా చిట్యాలకు చేరుకోవచ్చని తెలిపారు. చిట్యాల నుంచి నార్కట్‌పల్లి దాటితే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఆదివారం చౌటుప్పల్‌లో జరిగే వారంతపు సంత కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగ రద్దీకి సంత కూడా తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని, అందుకే ఆదివారం ప్రయాణించే వారు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వాహనదారులు సహనం పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News