Numaish Exhibition: నాంపల్లిలో నుమాయిష్ జనవరి 1 నుంచి ప్రారంభం, 1200కి పైగా స్టాళ్లు
నగరంలో నూతన సంవత్సర వేడుకలకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) మళ్లీ ప్రారంభం కానుంది.
Numaish Exhibition: నాంపల్లిలో నుమాయిష్ జనవరి 1 నుంచి ప్రారంభం, 1200కి పైగా స్టాళ్లు
హైదరాబాద్: నగరంలో నూతన సంవత్సర వేడుకలకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) మళ్లీ ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శన 85వ ఎడిషన్‌గా జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆరు వారాలకు పైగా కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పాల్గొననున్న ఈ నుమాయిష్‌లో 1,200కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. హస్తకళలు, వస్త్రాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రత్యేక వంటకాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కుటుంబ సమేతంగా వచ్చేవారికి వినోదం అందించేలా అమ్యూజ్‌మెంట్ రైడ్స్, ఫుడ్ కోర్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, బిహార్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. ప్రతి ఏడాది భారీగా సందర్శకులు వచ్చే నేపథ్యంలో ఈసారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, జనసందోహం నిర్వహణ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీతో కలిసి పౌరసంస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.