Hyderabad Crime: ఫిట్స్‌తో నవవధువు మృతి.. అల్లుడిపై కేసు నమోదు
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జన చైతన్య ఫేజ్–2లో నివసిస్తున్న నవవధువు ఐశ్వర్య ఆదివారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందింది.
Hyderabad Crime: ఫిట్స్‌తో నవవధువు మృతి.. అల్లుడిపై కేసు నమోదు
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జన చైతన్య ఫేజ్–2లో నివసిస్తున్న నవవధువు ఐశ్వర్య ఆదివారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆమెకు ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఐశ్వర్య అనూహ్య మృతి ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. తమ కుమార్తె మరణానికి భర్త రాజే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివాహానంతరం ఐశ్వర్యను మానసికంగా, శారీరకంగా వేధించాడని చెబుతూ అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలు ఐశ్వర్య, రాజు కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అభ్యంతరాలను పక్కనపెట్టి గత నవంబర్‌లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. పెళ్లై నెల కూడా పూర్తికాకముందే ఐశ్వర్య మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
వివాహం తర్వాత నుంచి ఐశ్వర్య తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అత్తవారి ఇంట్లో జరిగిన పరిణామాలే ఈ అనుమానాస్పద మృతికి కారణమై ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఫిట్స్ కారణంగానే మృతి జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అసలు మరణ కారణం ఏమిటన్నది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని తెలిపారు.
ఈ ఘటనపై రెండు వైపుల వాదనలు పరిశీలిస్తూ, వైద్య నివేదికలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ప్రేమ వివాహం అనంతరం నెల తిరగకముందే నవవధువు మృతి చెందడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.