Corona victims in Telangana: లక్షణాలున్న వారు లక్షన్నరకు పైనే

Corona victims in Telangana: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితుల సంఖ్య

Update: 2021-05-13 02:55 GMT

Corona victims in Telangana:(File Image) 

Corona victims in Telangana: రాష్ట్రంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు లక్షన్నరకు పైగా ఉన్నట్లు తేలింది.పూర్తి వివరాల్లోకి వెళితే....రాష్ట్ర వ్యాప్తంగా జ్వర బాధితులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైద్య బృందాలు ఇల్లిల్లూ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నాయి. ఈ గణాంకాల ఆధారంగా గత వారం రోజుల్లో కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారు దాదాపు లక్షన్నరకు పైగానే ఉన్నట్లు తేలింది.

ప్రభుత్వం నిర్వహిస్తోన్న కేంద్రాలు సహా ప్రైవేటులో నమోదవుతున్న నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌ రూపంలో రోజూ వెల్లడిస్తోంది. అందులో వెల్లడైన పాజిటివ్‌ కేసుల సమాచారానికి అదనంగా ఈ లక్షన్నర మంది బాధితులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,064 కేంద్రాల్లో ఉచితంగా కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

లక్షణాలున్నప్పటికీ పరీక్షలకు నోచుకోని వారు ఇంటి వద్దనే ఉంటున్నారు. కొవిడ్‌ నిర్ధారణ కాలేదనే ధైర్యంతో సొంత పనులు చేసుకోవడం, ఇతరులతో కలిసిమెలిసి తిరగడం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు, తమతో సన్నిహితంగా మెలిగిన వారికి వైరస్‌ వ్యాపించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఊహించని వేగంతో పెరగడానికి ఇది కూడా కారణమని వైద్యవర్గాలు గుర్తించాయి.

ముఖ్యంగా గ్రామీణులు అవగాహన లోపంతో బాధితులుగా మారి, ఆఖరి నిమిషంలో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌లుగా నిర్ధారణవుతున్న వారు కూడా దాదాపు 70 శాతానికి పైగానే ఉంటున్నారని అంచనా.

సర్వేలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ, పట్టణాల్లో ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర సమస్యలున్నవారిని గుర్తిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 9,433 మందిని కొవిడ్‌ లక్షణాలున్నవారిని గుర్తించారు. ఆరోగ్య ఉపకేంద్రం స్థాయిలో ఏఎన్‌ఎంలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓపీలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నట్లుగా గుర్తిస్తే వెంటనే ఔషధ కిట్‌ను అందజేస్తున్నారు.

Tags:    

Similar News