హుజూర్‌నగర్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం
హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సకల ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 24న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సకల ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 24న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం జరిగే పోలింగ్ కు ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బరిలో 28మంది అభ్యర్థులు నిలిచారు. ఎలక్షన్ కమిషన్ 302 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 1500 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు.
హుజూర్ నగర్ అర్బన్ లో 31 పోలింగ్ కేంద్రాలు, రూరల్ లో 271 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 79 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 967 బ్యాలెట్ యూనిట్లు, 363 కంట్రోల్ యూనిట్లతో పాటు 378 వీవీ ప్యాట్ లను ఉపయోగిస్తున్నారు. హుజూర్ నగర్ లో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు కార్డుతో పాటు 15 రకాల గుర్తింపు కార్డులు ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఎలక్షన్ కమిషన్ కల్పించింది.
హుజూర్ నగర్ బై పోల్ కు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘాను మరింత పెంచారు. సుమారు 2 వేలకు పైగా పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే తనిఖీల్లో సుమారు కోటికిపైగానే నగదును పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
హుజూర్ నగర్ మార్కెట్ గోదాం నుంచి ఈవీఎంలను పోలింగ్ సిబ్బంది తీసుకెళ్లారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. హామీల వర్షం కురిపిస్తూనే ప్రత్యర్ధి పార్టీలపై నేతలు విమర్శనాస్త్రాలు సంధిచారు. ఈనెల 24న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.