Historic Monuments: వందల ఏళ్ల నాటి మెట్లబావికి ఆధునిక హంగులు

Historic Monuments: సంగారెడ్డి జిల్లాలో ఉన్నవందల ఏళ్ల నాటి మెట్లబావికి ఆధునిక హంగులు అద్దుతున్నారు.

Update: 2021-03-10 11:10 GMT
ఫైల్ ఇమేజ్ 

Historic Monuments: అంతరించిపోతున్న కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని వారు అనుకోలేదు ఆ యువకుడు. తనంతట తానుగా చరిత్రను భావితరాలకు అందించేందుకు సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట 16 కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారు. ఈయన తన వార్డు పరిధిలో శతాబ్దాల క్రితం నిర్మించిన మెట్లబావికి పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు పనులు చేపట్టారు. ఆ మెట్ల బావి కథ  తెలుసుకుందాం.

కాకతీయుల కాలంలో నిర్మాణం...

మెట్లబావి కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. పూర్వకాలం రాజంపేటలో రాణి శంకరమ్మ శ్రీ రాజరాజేశ్వరాలయాన్ని నిర్మించారు. ఆలయానికి వచ్చే భక్తులు స్నానాలు ఆచరించడానికి ఇక్కడ ఓ పెద్ద బావిని కూడా నిర్మించారు. బావి చుట్టూ మెట్లు కట్టారు.. ఈ బావిలో స్నానం చేయడంతో గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మంకం. ఇదే బావి అటు తాగు, సాగు నీటికి కూడా ఉపయోగపడేవి..

కనుమరుగవుతోంది!

ఒకప్పుడు రాజంపేట వాసులకు తాగు నీటిని అందించిన మెట్లబావి క్రమంగా కనుమరుగవుతోంది. ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి.. బావి మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది. ఇది చూసి చలించిన వార్డు కౌన్సిల్ కొత్తపల్లి శ్రీకాంత్ సభ్యులకు మాట ఇచ్చినట్టుగానే మెట్లబావి ఆధునికీకరణ పనులు చేపట్టారు. దాదాపు పనులు పూర్తి కావొచ్చాయి. బావి చుట్టూ రంగు రంగుల లైట్లతో కొత్త అందాలను తీసుకొచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి ఓ అందమైన పార్కును తెస్తున్నారు.

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధే లక్ష్యంగా

వచ్చే శివరాత్రి నాటికి పనులు పూర్తి చేసి రాజంపేటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ పని చేయడం తామకెంతో ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు.. మెట్లబావులను పూడ్చకుండా చరిత్రకకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న పురాతన కట్టడాలను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News