వాతావరణ శాఖ హెచ్చరిక: రెండు రోజుల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తాజాగా వెల్లడించింది.

Update: 2020-02-09 07:42 GMT
Representational Image

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తాజాగా వెల్లడించింది. శనివారం నుంచి రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురిసాయని తెలిపారు. తమిళనాడు నుంచి ఛత్తీస్ గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని చెప్పారు. ఈ ప్రభావంతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసారు. ఇకపోతే నిన్న ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి మేడారం జాతరలోని భక్తులు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు.

ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడతాయన్నారు. ఇక పోతే శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో కురిసిన అత్యధిక వర్షపాతం చూసుకుంటే కరీనంగర్ జిల్లా వెల్దిలో 60, సర్వాయిపేటలో 44.3, హుస్నాబాద్‌లో 30.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వాతావరణం అత్యంత చల్లబడటంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.

ఇక పోతే రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతే కాకుండా బయటికి వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఈ వర్షం కారణంగా వాతావరణం పూర్తి స్థాయిలో తగ్గిపోయి చల్లని గాలులు వీస్తాయని తెలిపారు.

Tags:    

Similar News