తెలుగురాష్ట్రాల్లో ఎడతెరపిలేని వర్షాలు

Update: 2019-07-30 00:48 GMT

ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రాలో పలు చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల నుండి తెరపి లేకుండా పడుతున్నాయి. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగి ప్రవహింస్తున్నాయి. మరికొన్ని చోట్ల చెరువులకు గండిపడుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ముసురు అలుముకుంది. రెండు రోజులుగా తేలికపాటి వర్షాలతో తడిసిముద్దైంది. ఏకధాటిగా చిరుజల్లులు కురుస్తుండటంతో.. పంటలకు ఊపిరి పోసినట్లైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో సుమారు 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో చింతలమానేపల్లి మండలంలో రెండు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తోంది. మంగపేట మండలం మొట్లగూడెం సమీపంలో మల్లూర్ వాగు ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. నరసింహాసాగర్, పూరేడుపల్లి, నరేంద్ర రావుపేట, శనగకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మంచిర్యాల జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరింది. జలకళ సంతరించుకుంది. పొరుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది.తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు చోట్లు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. అక్కడక్కడా భారీగా కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో రోడ్లన్నీ డ్యామేజ్‌ అయ్యాయి.

Tags:    

Similar News