Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Hyderabad: తెల్లవారుజాము నుంచే కురుస్తున్న భారీ వర్షం మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట,

Update: 2021-06-14 07:35 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం (ఫైల్ ఇమేజ్)

Hyderabad: తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. రాజధాని నగరంలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి నగరంలోని మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌పుర్‌, మలక్‌పేట, వనస్థలిపురంలో వర్షం పడుతోంది. రాష్ట్రంలోని పలుచోట్ల సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఖమ్మంలో కూడా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచే వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రఘునాథపాలెం మండలం కూసుమంచి ఖమ్మం గ్రామీణం కొనిజర్ల చింతకాని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాల వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని, గాలివేగం గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ. వరకు ఉంటుందని పేర్కొంది. అల్పపీడనం.. వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌ తీరం, ఉత్తర ఒడిసా ప్రాంతాల్లో కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, ఒడిసా, జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 

Tags:    

Similar News