Charlapalli Family Suicide: చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ.. కారణం అదే!
Charlapalli Family Suicide: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన చర్లపల్లి ముగ్గురి ఆత్మహత్య కేసు సుఖాంతమైంది.
Charlapalli Family Suicide: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన చర్లపల్లి ముగ్గురి ఆత్మహత్య కేసు సుఖాంతమైంది. ఐటీ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల మృతికి గల కారణాలను పోలీసులు ఛేదించారు. 9 రోజుల పాటు లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు.. ఈ ఘోరానికి 'తీవ్రమైన డిప్రెషన్' (Depression) మాత్రమే కారణమని తేల్చి చెప్పారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయశాంతి తన పిల్లలు చేతనా రెడ్డి, విశాల్ రెడ్డిలను అమితంగా ప్రేమించడమే కాకుండా, వారిని పూర్తిగా తన అదుపులో ఉంచుకున్నారు. తాను లేకపోతే తన పిల్లలు ఒంటరైపోతారని, వారు బతకలేరని ఆమె బలంగా నమ్మారు. ఈ క్రమంలోనే తాను చనిపోతూ పిల్లలను కూడా ఆత్మహత్యకు ఒప్పించి, అందరూ కలిసి గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఉప్పల్‌కు చెందిన విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గత నెల 30న రాత్రి, విజయశాంతి హాస్టల్‌లో చదువుకుంటున్న తన ఇద్దరు పిల్లలను కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. కారు పార్కింగ్ స్లిప్‌పై "ఇక బతకాలని లేదు" అని సూసైడ్ నోట్ రాసి, ముగ్గురూ కలిసి రైలు కింద పడ్డారు. ఈ విషాద దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు విజయశాంతి ల్యాప్‌టాప్, కాల్ హిస్టరీ, వాట్సాప్ చాట్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె భర్త, తల్లి, సోదరుడు మరియు సహోద్యోగుల నుంచి వాంగ్మూలాలను సేకరించారు.
విజయశాంతికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టమైంది. భర్తతో గానీ, ఇతర బంధువులతో గానీ ఎలాంటి గొడవలు లేవు. కేవలం మానసిక కుంగుబాటు (Depression) వల్లే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఉన్నత స్థితిలో ఉన్న ఆమె అంతలా డిప్రెషన్‌కు గురవ్వడానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. త్వరలోనే కేసును పూర్తిస్థాయిలో ముగించి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.