Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు మహా సన్నాహాలు.. తరలిరానున్న కోట్లాది మంది భక్తులు..!!
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు మహా సన్నాహాలు.. తరలిరానున్న కోట్లాది మంది భక్తులు..!!
Godavari Pushkaralu 2027: తెలంగాణలో 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటినుంచే విస్తృత సన్నాహాలు ప్రారంభించింది. కోట్లాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రాచలం కేంద్రంగా మౌలిక వసతులను భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా భద్రాచలం, మోతెగడ్డ, పర్ణశాల, చినరావిగూడెంలలో స్నాన ఘాట్‌ల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రస్తుతం 150 మీటర్ల పొడవుతో ఉన్న భద్రాచలం ఘాట్‌ను మరో 150 మీటర్లు పెంచి మొత్తం 300 మీటర్ల మేర విస్తరించనున్నారు. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మంది భక్తులు సురక్షితంగా స్నానాలు ఆచరించేందుకు అవకాశం కలుగుతుంది. ఘాట్‌ల వద్ద బలమైన బారికేడింగ్ ఏర్పాటు చేసి, గుంపుల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం వాటర్‌ప్రూఫ్ టెంట్లు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేక చేంజింగ్ రూములు, విశ్రాంతి వసతులు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాలు, సహాయక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచనున్నారు.
పుష్కరాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్ల విస్తరణ, పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, షటిల్ సేవలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గోదావరి పుష్కరాల కోసం సన్నాహాలు ప్రారంభించడంతో, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సురక్షిత, సౌకర్యవంతమైన పుష్కర దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.