Toll-Free: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. టోల్ ఫ్రీ?
Toll-Free: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. టోల్ ఫ్రీ?
Toll-Free: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఊరట కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పండుగ సందర్భంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులపై పడే ఆర్థిక భారం తగ్గించేందుకు టోల్ ఛార్జీలను ప్రభుత్వం భరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రయాణ ఖర్చు తగ్గడమే కాకుండా, టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లకు కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల నుంచి భారీగా ప్రజలు తమ స్వగ్రామాలకు తరలివస్తుంటారు. ఈ క్రమంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, పండుగ రోజుల్లో టోల్ ఫ్రీ సదుపాయం కల్పించాలనే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడ వంటి ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు ఈ వెసులుబాటు వర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో కలిసి సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది. టోల్ ఛార్జీలు లేకపోవడంతో ప్రయాణం మరింత సాఫీగా, వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే, ఈ ప్రతిపాదన అమలుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కీలకం. అనుమతి లభిస్తే సంక్రాంతి పండుగను మరింత ఆనందంగా జరుపుకునేందుకు ప్రయాణికులకు ఇది పెద్ద వరంగా నిలవనుంది. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే, టోల్ ఫ్రీ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.