భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక..మెట్ల వరకు చేరిన వరద

Update: 2020-08-16 07:58 GMT
గోదావరి

Godavari River Flood : భద్రాచలం పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో క్రమక్రమంగా నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం గోదారిలో నీటిమట్టం 48.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. రామాలయం మెట్ల పైకి వరద వచ్చింది. ఆదివారం ఉదయం ఈ మార్గంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. భారీ వరదలకు భద్రాచలం వద్ద శ్రీరాముడి ఆలయ అన్నదాన సత్రంలోకి నీరు చేరింది. ఆలయానికి చెందిన కల్యాణ కట్ట, స్నాన ఘట్టాలు నీట మునిగాయి.

శనివారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమలులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఉధృతికి దుమ్ముగూడెం మండలం లక్ష్మీపూర్‌ వద్ద రహదారిపైకి నీరు చేరాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం, చెర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఇక గోదావరిలో వరద నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఇప్పటికే బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రతి ప్రతి ప్రభావిత గ్రామంలోనూ చాటింపు వేశారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.


Tags:    

Similar News