గ్రేటర్‌లో విలీన గందరగోళం.. ఆస్తిపన్ను సెగతో నగరవాసుల గుబులు

Update: 2025-12-23 09:57 GMT

గ్రేటర్ లో చుట్టుపక్కల విలీనం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్డియా అధికారులకు గుండెల్లో గుబులు రేపుతున్నాయి.. ఆస్తిపన్ను లెక్కింపు ఓ ప్రదాన సమస్యగా మారుతోంది. రెంటల్ వాల్యూ కలెక్షన్ పైనా అయోమయం.. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అధికారుల వైఖరి.. ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్నాయి.. ఆస్తి పన్ను లెక్కింపుపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. ఇంతకీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆస్తిపన్ను వసూలు అధికారులు ఎలాంటి పద్దతులు అవలంబించనున్నారు.. ప్రజలకున్న అభ్యంతరాలేమిటి

జీహెచ్‌ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు సవాల్‌గా మారుతున్నది. శానిటేషన్‌, రోడ్లు, వీధి నిర్వహణ, నిర్మాణ రంగ అనుమతులకు తోడు తాజాగా ఆస్తిపన్ను లెక్కింపుపై గందరగోళం నెలకొంది. విలీనమైన 27 పురపాలికల పరిధిలోని ప్రాపర్టీల వివరాలను సీజీజీ ద్వారా జీహెచ్‌ఎంసీ రికార్డుల్లోకి బదలాయించారు. ఈ నేపథ్యంలోనే ఆస్తిపన్ను లెక్కింపుపై అధికారులు స్పష్టత రాకపోవడంతో అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో అయోమయం పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్తిపన్ను లెక్కింపులో రెండు విధానాలు ఉండడమే ఇందుకు కారణమైంది.

వాస్తవంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రెంటల్‌ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ టాక్స్‌ వసూలు చేస్తున్నారు. 27 పురపాలికల్లో మాత్రం క్యాపిటల్‌ వాల్యూ ..సబ్‌ రిజిస్ట్రార్‌ రేటు ఆధారంగా ప్రాపర్టీ టాక్స్‌ వసూలు చేస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో 27 పురపాలికలు విలీనం చేయడంతో ఒకే ప్రాంతంలో రెండు రకాల ప్రాపర్టీ వసూలు చేయడంపై నగరవాసుల్లో అయోమయం నెలకొన్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్‌ 16.35 లక్షలు, నాన్‌ రెసిడెన్షియల్‌ 2.80 లక్షలు, మిక్ట్స్‌ 34వేలు ఉన్నాయి.

విలీన సమస్యల్లో ప్రజలపై భారీగా ప్రభావం చూపే అంశాల్లో ఆస్తిపన్ను ఒకటి.. దీనిపై ప్రభుత్వాధికారుల్లో పూర్తి స్థాయి క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రాపర్టీ వసూలు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమపై అదనపు భారం పడుతుందని ప్రజలు భావిస్తున్నారు. కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో ప్రజల్లో ఆస్తిపన్నుపై భయాందోళనలు నెలకొన్నాయి.

గతేడాదిలో రూ.2038.42 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆస్తిపన్ను రూ.2500 కోట్లు వసూలు చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ప్రస్తుతం రూ.1500 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేసింది. విలీనంతో మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం అమలవుతున్న రెండు విధానాలనే కొనసాగిస్తారా? లేదంటే మార్పులు చేస్తారా? అన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సీడీఎంఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో వసూలయ్యే ప్రాపర్టీ టాక్స్‌కు సమానంగా 27 మున్సిపాలిటీల్లో వసూలు చేస్తారా? లేదంటే జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం వసూలు చేసి ప్రజలపై భారం మోపుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News