కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుకు రేవంత్ కు కాంగ్రెస్ వినతి: రూల్స్ ఏం చెబుతున్నాయి?

అసెంబ్లీకి హాజరుకాని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

Update: 2025-03-24 09:43 GMT

అసెంబ్లీకి హాజరుకాని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని హస్తం పార్టీ విమర్శలు చేస్తోంది. అసెంబ్లీకి హాజరుకాకున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ రూ.57 లక్షలకు పైగా జీత భత్యాలు తీసుకున్నారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అసెంబ్లీకి వరుసగా ఎన్ని రోజుల పాటు సభ్యులు హాజరుకాకుండా ఉండేందుకు వెసులుబాటు ఉంది. రాజ్యాంగంలో దీనికి సంబంధించి ఉన్న నిబంధనలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

అసెంబ్లీకి హాజరుకాకపోతే సభ్యత్వం కోల్పోతారా?

ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే అసెంబ్లీకి స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ఆ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసి ఆ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారని రాజ్యాంగం చెబుతోంది. రాజ్యాంగంలోని 190 (4)లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరుకాకపోతే చర్యలు తీసుకోవచ్చనేది ఆ నిబంధన చెబుతోంది. 60 రోజుల కాలాన్ని లెక్కించే విషయంలో కూడా కొన్ని అంశాలను ప్రత్యేకించి ప్రస్తావించారు. వరుసగా సభ నాలుగు రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని, ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని నిబంధనలు చెబుతున్నాయి. చట్ట సభల సమావేశాలు గతంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ రోజులు సమావేశాలు జరుగుతున్నాయి.అసెంబ్లీ, పార్లమెంట్ కాలవ్యవధి ఐదేళ్లు. అయితే ఈ ఐదేళ్లలో కనీసం 150 రోజుల కూడా సమావేశాలు జరగని సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.

సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?

ఏదైనా కారణంతో అసెంబ్లీకి హాజరుకాకపోతే సెలవును కోరవచ్చు. అయితే సెలవు తీసుకోవాలంటే సరైన కారణం చూపాలి. తీవ్రమైన అనారోగ్యం లేదా ఇతరత్రా కారణాలను చూపి సెలవుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు లేఖను స్పీకర్ కు లేదా అసెంబ్లీ సెక్రటరీకి అందించాలి. ఈ దరఖాస్తును అసెంబ్లీలో ప్రవేశపెట్టి లీడర్ ఆఫ్ హౌస్ అనుమతివ్వాలి. ఇలా సెలవు కోసం అనుమతి తీసుకోని సభ్యులపై చర్య తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News