ఇవాళ్టి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
Free Bus: మ.1.30 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇవాళ్టి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
Free Bus: తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మహాలక్ష్మిని సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందుబాటులోకి వస్తుందని మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. రాష్ర్టానికి చెందిన బాలికలు, విద్యార్థినులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వివరించారు. ఉచిత బస్సు ప్రయాణ స్కీంను సీఎం రేవంత్ ప్రారంభిస్తారని, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, మహిళా అధికారులు, ఉద్యోగులు హాజరవుతారని తెలిపారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో ఈ పథకం అమలుపై శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించామని వివరించారు. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్‌స్టేషన్ల నిర్వహణపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఉచిత ప్రయాణంలో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. గత రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ ఆదాయం పెరిగిందని గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ 7వేల,292 బస్సులను ఈ పథకానికి వాడుకోనున్నట్టు సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం మంది మహిళలు నిత్యం ప్రయాణిస్తున్నారని, ఉచిత బస్సు ప్రయాణంతో 55 శాతం దాకా వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. దానికి అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉందని వివరించారు. ఆర్టీసీకి రోజువారీగా 14 కోట్ల ఆదాయం వస్తుందని, పథకం అమలైతే ఇది 50 శాతానికి తగ్గే అవకాశం ఉంటుందని, అంటే రోజుకు సంస్థపై 7 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు.