Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు హల్ చల్

Asifabad: ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న గజరాజు

Update: 2024-04-04 11:09 GMT

Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు హల్ చల్

Asifabad: మహారాష్ట్ర అడవుల నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లోకి వచ్చిన ఓ ఏనుగు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇద్దరిని చంపేయడంతో అటవీ శివారు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మహారాష్ట్రలో ఓ ఏనుగు కొన్ని నెలల క్రితం ఇదే తీరుగా వ్యవహరించి... కొందరి ప్రాణాలను తోడేసింది. ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది... అయితే గతంలో మహారాష్ట్రలో ప్రాణాలు తీసిన ఏనుగు... ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఏనుగు ఒక్కటేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంట పొలాలకు వెళుతున్న రైతులను సంహరిస్తుండడంతో ఆ గ్రామస్తులు గజగజ వణుకుతున్నారు. పంట చేల వైపు వెళ్లడానికి జంకుతున్నారు. అటవీ శివారు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.

కొమురంభీం జిల్లా ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందారు. నిన్న చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో రైతు అల్లూరి శంకర్ మిరప తోటలో పనిచేస్తుండగా ఆకస్మికంగా ఏనుగు దాడి చేసి చంపింది. ఈరోజు ఉదయం 4 గంటలకు పెంచికల్ పేట్ మండలం కొండలపెల్లికి చెందిన కుర పోచయ్య ఉదయం పంట పోలానికి మోటర్ వేయడానికి వెళ్లాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఏనుగు దాడి చేసి చంపేసింది. ఫారెస్ట్ అధికారులు ఏనుగును మహారాష్ట్ర వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ టైగర్ కారిడార్‌లో పులులు సంచరిస్తుంటాయి... కానీ వేసవి ప్రారంభం కావడం... ఎండ వేడిమికి పులుల అలజడి లేకపోవడంతో కొన్నిరోజులుగా ప్రశాంతంగా ఉన్న గ్రామాలు.. ఏనుగు రాకతో బెజ్జూరు, చింతలమానపల్లి, కౌటాల మండలాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మనుషులు కనబడితే చాలు దాడి చేసేందుకు ఏనుగు పరుగులు పెడుతోంది. ఈరోజు మరో రైతు వ్యవసాయ పనులకు వెళుతుండగా కనబడింది. ఆ రైతు అరుపులు వేయడంతో ఏనుగు వెంబడించింది.. అయితే గ్రామ సమీపంలోని ఓ ఇంటి దాబా పైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు.. దీంతో వ్యవసాయ పనులకు కానీ బయటకు ఎవరికి వెళ్లవద్దని బెజ్జూరు తహసీల్దార్ 144 సెక్షన్ విధించారు..

ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు రైతుల ప్రాణాలు పోయాయని ఫారెస్ట్ అధికారులతో కొండపల్లి గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు.. ఎనిమల్ ట్రాకర్ టీములు... బీట్ ఆఫీసర్లు ఉంటారని, ఓ సెక్షన్ నుంచి పక్క సెక్షన్ వెళితే... పక్క సెక్షన్‌కు సమచారం ఇస్తారని, రేంజ్ దాటితే పక్క రేంజ్ వారికి సమచారం ఇవ్వాలని కానీ సమాచారం ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు... ఫారెస్ట్ అధికారులకు ఏనుగు ఎంటర్ అయినట్లు సమాచారం అందలేదా..? తమను ఎందుకు అలర్ట్ చేయలేదని సమీప గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఏనుగులను పట్టుకొని జూపార్కుకు తరలించాలి డిమాండ్ చేశారు. లేదంటే మహారాష్ట్ర వైపు మళ్లించాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు హెచ్చరించారు.

ఏనుగు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చెందినదిగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. అయితే అక్కడ ఓ ఏనుగు ముగ్గురిని హతమార్చింది. ఈ ఏనుగు.... ఆ ఏనుగు.... ఒక్కటే అయి ఉంటుందా...? అని ప్రజలంతా భయపడుతున్నారు.. ఈరోజు ఉదయం కొండపల్లి శివారులోని ప్రాణహిత కెనాల్ వద్ద ఏనుగు పాదముద్రలను అధికారులు గుర్తించారు.. సలగుపల్లి పైపు వెళ్లినట్టు అంచనాకు వచ్చారు... ఎవరూ బయటకు రావొద్దని... ఏనుగు సంచరిస్తుందని దండోరా వేయిస్తూ... గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు...

Tags:    

Similar News