Egg Price Hike: సండే హో యా మండే తినాలంటే ఇక కష్టమే..కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు
Egg Price Hike: సండే హో యా మండే రోజ్ ఖావో అండే.. అంటూ ఎంత ప్రచారం చేసుకున్నా.. ఇప్పుడు కోడిగుడ్డు రోజూ తినలేని పరిస్థితి నెలకొంది.
Egg Price Hike: సండే హో యా మండే తినాలంటే ఇక కష్టమే..కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు
Egg Price Hike: సండే హో యా మండే రోజ్ ఖావో అండే.. అంటూ ఎంత ప్రచారం చేసుకున్నా.. ఇప్పుడు కోడిగుడ్డు రోజూ తినలేని పరిస్థితి నెలకొంది. దేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో నెంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి కోడిగుడ్లు పక్క రాష్ట్రాలకు తరలిపోతుండడంతో ఇక్కడ ధరలు మండిపోతున్నాయి. ఓవైపు పెరుగుతున్న చలి మరోవైపు కోడుగుడ్డు ధరలు కూడా పెరుగుతుండటంతో గుడ్డు ప్రియులకు ఇది గడ్డు కాలంగా మారింది.
సాధారణంగా ప్రతి ఏడాది చలికాలం ప్రారంభం కాగానే, నవంబరు నుంచి మూడు నెలల పాటు కోడి గుడ్డు ధరకాస్త పెరుగుతుంది. అయితే, ఈసారి సీన్ మారింది. గత సంవత్సరంలో ఒక్కో గుడ్డు ధర 6 రూపాయలు ఉండగా.. ఈసారి మాత్రం 8 రూపాయలు దాటింది. దీంతో సామాన్యులే కాదు దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి వర్గాలు రోజూ కోడిగుడ్డు తినడానికి ఆలోచిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఏపీతో పాటు నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్‌లో ఈసారి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో అక్కడ అధిక డిమాండ్ ఏర్పడింది. ఆ రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇక్కడి కంటే అక్కడ ఒక్కో గుడ్డుకు 25 పైసలు ఎక్కువే చెల్లిస్తుండడంతో మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం గుడ్లలో 60 నుంచి 70 శాతం గుడ్లు ఆ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఒక్క ముంబైకే రోజుకు 60 నుంచి 70 లక్షలు, విదర్భకు 30 లక్షలు, యూపీకి 80 లక్షలు ఎగుమతి చేస్తున్నారు. అయినా ఇప్పుడు అక్కడ ఒక్కో గుడ్డు ధర 10 రూపాయల వరకు ఉందంటున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. ఈ సంవత్సరం కోడిపిల్లల ఉత్పత్తి కొంత తగ్గినా గుడ్ల ఉత్పత్తిలో మాత్రం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరో 30 శాతం ఉత్పత్తి పెరిగిందని పౌల్ట్రీ నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలో రోజుకు కోట్ల సంఖ్యలో కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోందని,.. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు 2 కోట్ల వరకు కోడిగుడ్లను వినియెస్తుంటారని ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అధికారులు తెలిపారు.
కోడిగుడ్లకు డిమాండ్ ఉండగా 50 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నారు. దీంతో భారీగా డిమాండ్ పెరిగి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నగరంలోని హోల్ సేల్ మార్కెట్లో ప్రస్తుతం డజన్ గుడ్ల ధర 90 రూపాయలు ఉండగా, రిటైల్ మార్కెట్‌లో 8 రూపాయల నుంచి 8 రూపాయల 50 పైసలకు అమ్ముతున్నారు. తెలంగాణలోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాలు, సోషల్ వెల్‌ఫేర్ హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా ఉంటుంది. వీటికి యథావిధిగా సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంతో పాటు నగరంలో జనాలకు గుడ్ల సరఫరా తగ్గి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతున్నాయి.
ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి వరకు కోడిగుడ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఈసారి రాష్ట్రంలో కొరత కారణంగా ధరలు పెరిగాయి. ఈ ధరలు వేసవి నాటికి తగ్గే అవకాశం ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉన్న నార్త్ ఈస్ట్రన్‌తో పాటు నార్త్ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కోడిగుడ్డు ధరలు 9 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఉంది.