Saleshwaram Jathara: అధికారుల నిర్లక్ష్యం.. భక్తుల ప్రాణాల మీదకు తెచ్చిన జాతర..!

Saleshwaram Jathara: సలేశ్వరం...!! ఈ పేరు వినగానే ఎత్తైన కొండలు, జాలువారుతున్న జలపాతాలు గుర్తుకు వస్తాయి.

Update: 2023-04-07 14:30 GMT

Saleshwaram Jathara: అధికారుల నిర్లక్ష్యం.. భక్తుల ప్రాణాల మీదకు తెచ్చిన జాతర..!

Saleshwaram Jathara: సలేశ్వరం...!! ఈ పేరు వినగానే ఎత్తైన కొండలు, జాలువారుతున్న జలపాతాలు గుర్తుకు వస్తాయి. వీటికి తోడు దట్టమైన అటవీ ప్రాంతం. అచ్చం అమర్నాథ్‍ యాత్రను తలపించే అనుభూతి. తెలంగాణ అమర్నాథ్‍ యాత్ర సలేశ్వరానికి కేవలం మూడు రోజులు మాత్రమే అనుమతి ఉంది. లోతైన లోయలో కొలువైన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్త జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో సలేశ్వరం జాతర ప్రాంగణం భక్తులతో కిక్కిరిపోతోంది. ఈ జనసంద్రంలో భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సలేశ్వరం వెళ్ళిన భక్తులు ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరోకరు మృత్యువాత పడటం, అక్కడి ఏర్పాట్లపై కొనసాగిన నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

నాగర్‍కర్నూల్‍ జిల్లా లింగాల మండలం దట్టమైన నల్లమల్లలోని లోతైన లోయలో సలేశ్వరం లింగమయ్య స్వామి వెలిశాడు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి సైతం పెద్దఎత్తున భక్తులు నల్లమల్లకు తరలివచ్చారు. దర్శనానికి వెళ్లే భక్తులు వస్తున్న లింగమయ్య అంటూ శరణు ఘోష చేస్తూ పాదయాత్రతో లోయలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సలేశ్వరం సందర్శనకు అటవీశాఖ అధికారులు కేవలం మూడు రోజులు మాత్రమే అనుమతినిచ్చారు. దీంతో సలేశ్వరం జాతర భక్తులతో కిక్కిరిసిపోతోంది. దట్టమైన అడవిలో, లోతైన లోయలో కొలువైన శివయ్యను దర్శించుకునే క్రమంలో తోక్కిసలాట, తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. గుండెపోటుతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన గొడుగు చంద్రయ్య మృతి చెందాడు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణానికి చెందిన నిండు గర్భిణీ విజయ ఊపిరాడక చనిపోయింది. తోపులాటలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

గత ఏడాది సలేశ్వరం సందర్శన ఐదు రోజుల పాటు ఉండగా, ఈ ఏడాది మాత్రం మూడు రోజులకే అధికారులు అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. వేలాదిగా భక్తజనం తరలిరావడంతో సలేశ్వరం జనంతో కిక్కిరిసిపోయింది. దీంతో లోయ ప్రాంతమంతా జనాలతో నిండిపోయి తొక్కిసిలాటలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో లింగమయ్య దర్శనం భాగ్యం కలగక కొంతమంది భక్తులు మార్గమధ్యలోనే తిరుగుప్రయాణమయ్యారు. భక్తుల రాకకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో తమకు ఇక్కట్లు తప్పలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సలేశ్వరం జాతరలో జనం తొక్కిసలాటలు చోటు చేసుకోవడంతో కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ప్రాణ భయంతో లింగమయ్యను దర్శించుకోకుండానే చాలా మంది భక్తులు వెనుదిరుగుతున్నారు. భక్తులు సరైన సదుపాయాలు, రక్షణ చర్యలు కల్పించడంలో అధికారులు, ప్రతి సంవత్సరం విఫలం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Full View


Tags:    

Similar News