Telangana Elections: తెలంగాణ గడ్డపై ఢిల్లీ సైన్యం దండయాత్ర
Telangana Elections: ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న అమిత్‌షా, నడ్డా, ఖర్గే, రాహుల్, ప్రియాంక
Telangana Elections: తెలంగాణ గడ్డపై ఢిల్లీ సైన్యం దండయాత్ర
Telangana Elections: తెలంగాణ గడ్డపై ఢిల్లీ సైన్యం దండయాత్ర చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణ బాట పట్టారు. ఒకరి వెనక ఒకరు తెలంగాణలో వచ్చి వాలుతున్నారు. మూడు నాలుగు రోజులు ఇక్కడే మకాం వేసి ప్రచారంతో ఇంకాస్త దుమ్మురేపు పనిలో పడ్డారు. తెలంగాణలో జెండా పాతాలనే ఒకే ఒక లక్ష్యంతో అగ్రనేతలంతా ఆఖరి ప్రచార బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు.
ఇటు రాష్ట్ర నేతలు, అటు జాతీయ నేతల ఎన్నికల క్యాంపెయిన్‌తో తెలంగాణ మోత మోగుతోంది. ఏ గల్లిలో చూసినా ప్రచార ఆర్భాటమే. మీ ఓటు మాకే అనే నినాదాలే వినిపిస్తున్నాయి. గడిచిన 40రోజులు ఒక్క లేక మిగిలిన ఈ నాలుగు రోజులు ఒక లెక్క అన్నట్టుగా.. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. ఇటు జనాలకు కూడా తీరిక లేదు. ఒకో రోజు.. నాలుగైదు సభలు ఉండడంటో.. ఏ పార్టీ సభకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు.
సెప్టెంబర్ 9న తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం నాలుగు దశల్లో 5రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేసింది. ఇందులో నవంబర్ 7న ఫస్ట్ ఫేజ్‌లో మిజోరం ఎన్నికతో పాటు.. 17సీట్లకు ఛత్తీష్‌గఢ్ ఎన్నికలు చేపట్టింది. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌తో పాటు మిగిలిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికలను పూర్తి చేసింది. నవంబర్ 23న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను కంప్లీట్ చేసింది. లాస్ట్ ఫేస్‌లో నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.
నాలుగో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో.. ఇప్పుడు జాతీయ పార్టీల అగ్రనేత చూపంతా తెలంగాణపై పడింది. ఇవాళ్టితో కలిపి ప్రచారాన్ని ఇంకా 5రోజుల టైం మాత్రమే ఉండడంతో.. లీడర్లంతా క్యూ కట్టారు. ఇప్పటికే హోమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తెలంగాణలో వాలిపోయారు. ఎవరికి వారు.. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారంలో మునిగిపోయారు. రోజుకు మూడు, నాలుగు చోట్ల సభల్లో పాల్గొంటున్నారు.
రేపటి నుంచి 27వరకు తెలంగాణలోనే మకాం వేయబోతున్నారు ప్రధాని మోడీ. మొత్తం ఆరు బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొంటారు. వీరితో పాటు.. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, రాజ్ నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ కూడా బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొనబోతున్నారు. 25, 26 తేదీల్లో రాహుల్ తెలంగాణ పర్యటన ఉంది. 25వ తేదీన బోధన్, ఆదిలాబాద్, వేములవాడల్లో రాహుల్ ప్రచారం చేయనున్నారు. 26వ తేదీన కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్ లలో పాల్గొంటారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు మ్యానిఫేస్టోను కూడా ప్రజలకు వివరించనున్నారు రాహుల్.