ఆన్లైన్ మోసాలపై సైబరాబాద్ పోలీసుల షార్ట్ ఫిలిం

నేరాలు జరిగిన తరువాత ప్రతిస్పందించడమే కాదు.. అసలు నేరాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించడమూ ముఖ్యమే.

Update: 2020-12-27 04:18 GMT

a scene from the online cheating short film

నేరాలు జరిగిన తరువాత ప్రతిస్పందించడమే కాదు.. అసలు నేరాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించడమూ ముఖ్యమే. అందులోనూ సైబర్ నేరాల విసహాయంలో ప్రజలను నిత్యం అప్రమత్తంగా ఉంచాల్సిందే. దీనికోసం పోలీసులు నిత్యం శ్రమిస్తూ ఉండాల్సిందే. ఆన్లైన్ నేరాల విషయంలో ప్రజలను అలర్ట్ గా ఉంచడం కోసం సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నారు. సోషల్ మీడియాలో చేసే ప్రచారం ప్రజల్లోకి త్వరగా వెళ్ళిపోతుంది. అందుకే సైబరాబాద్ పోలీసులు నేరాల పై అవగాహన.. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు  ఇలా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. 

ఈ క్రమంలో తాజాగా ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా జరుగుతున్న మోసాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అవగాహన కల్పించే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సెకెండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలు సాగించే ఆన్లైన్ యాప్ ఓఎల్ఎక్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై ఒక షార్ట్ ఫిలిం సిద్ధం చేశారు. 'బివేర్‌ ఆఫ్‌ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ అండ్‌ ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్‌' అనే పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిం లో ప్రముఖ బుల్లితెర యాంకర్ వర్షిణి నటించడం విశేషం. ఆమెతో పాటు సింధు సంగం అనే కాలేజీ విద్యార్థిని కూడా ఈ షార్ట్ ఫిలింలో నటించారు. 

ఈ షార్ట్ ఫిలింను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ విడుదల చేశారు.

ఈ షార్ట్ ఫిలిం లో  పేర్కొన్న కొన్ని అంశాలు ఇవీ.. 

- సెకండ్ హ్యాండ్ వస్తువుల క్రయ విక్రయాలు జరిపే ఓఎల్ఎక్స్ యాప్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

_ లేని వస్తువులను ఉన్నట్టుగా ప్రచారం చేసి.. తక్కువ ధరలకు ఇస్తున్నట్టు చెబుతారు 

- ఆ వస్తువులను కొనుగోలు చేయాలని వచ్చిన వారిని సొమ్ములు తీసుకుని మోసం చేస్తారు 

- సెకెండ్ హ్యాండ్ వస్తువుల్ని యాప్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా సొమ్ము చెల్లించ వద్దు. వస్తువు చూసిన తరువాత.. దానికి సంబంధించిన అన్ని లావాదేవీలు పక్కాగా అయిన తరువాత మాత్రమే సొమ్ములు చెల్లించాలి.

- క్యూ ఆర్ కోడ్ పంపించి.. దాని ద్వారా సొమ్ములు చెల్లించమంటే అది కచ్చితంగా మోసమే అని గ్రహించాలి. అలా క్యూఆర్ కోడ్ ద్వారా సొమ్ములు చెల్లించవద్దు. 

- ఎప్పుడన్నా ఏదైనా అనుమానం వస్తే డయల్‌ 100, 9490617444 వాట్సాప్‌ నంబర్‌ను సంప్రదించాలని సీపీ సజ్జనార్‌ చెప్పారు. 


Tags:    

Similar News