Custard Apple: ఆదిలాబాద్ జిల్లాలో ఆకట్టుకుంటున్న సీతాఫలాలు
గిరిజనులకు ఉపాధిమార్గంగా మారిన సీతాఫలాలు సహజసిద్ధమైన ఈ పండ్లకు భారీగా గిరాకీ ప్రకృతి సిద్ధమైన ఈ పండ్లను ఇష్టపడుతున్న పట్టణవాసులు సామాన్యుడికి ఆరోగ్యం..గిరిజనులకు ఉపాధిని ఇస్తున్న ఫలాలు
Custard Apple: ఆదిలాబాద్ జిల్లాలో ఆకట్టుకుంటున్న సీతాఫలాలు
ఆదిలాబాద్ జిల్లా చిక్కని, పచ్చని అడవులకు పెట్టింది పేరు. అయితే ఆ అడవులే ఆయుపట్టుగా ఇక్కడి గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు. అడవులు, కొండల మధ్య ఉన్న గూడాలలో నివసించే ఆదివాసి గిరిజనుల ఉపాధికి అటవీ ఉత్పత్తులే ఆధారంగా నిలుస్తున్నాయి. ఇప్పపూలు, తునికి పండ్లు, జీడి గింజలు, మొర్రి పండ్లు, అడవి కాకర ఇలా కాలానుగుణంగా లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తూ ఇక్కడి గిరిజనులు ఉపాధిని పొందుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం సీజనల్ గా సీతాఫలాలే గిరిజనుల ఉపాధిని కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం సీతాఫలాల సీజన్ నడుస్తోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లంటే చిన్నా పెద్దా అంతా ఇష్టంగా తింటారు. దీంతో అటవీ ప్రాంత సమీపంలో సహజ సిద్దంగా పెరిగి పెద్దయిన సీతాఫలం చెట్ల నుండి కాయలను కోసుకువచ్చి, వాటిని గంపల్లో మూటకట్టుకొని పట్టణ ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయించడం ద్వారా ఉపాధిని పొందుతున్నారు. ఈసారి జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో పంటల పరిస్థితి అయోమయంగా మారింది. వ్యవసాయ పనులకు వెళ్ళే గిరిజనులకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ సీజన్ లో పనులు లేక.. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఉపాధి కోసం సీతాఫలాలపై గిరిజనులు దృష్టిసారించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూరు మండలం దామన్ గూడ, చింతగూడ, కమలాపూర్, మాన్కపూర్, ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్, గౌరాపూర్ తదితర గిరిజన గ్రామాల నుండి ప్రతిరోజు గంపల్లో పండ్లను తీసుకొని వచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ రహదారికి ఇరువైపులా కూర్చోని విక్రయిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు రోడ్డుకు ఇరువైపులా, ప్రధాన వాణిజ్య కూడళ్లలో ఈ సీతాఫలాలను పెట్టి విక్రయిస్తున్నారు. రోడ్డు వెంట వచ్చి పోయే వాహనదారులు వారికి కావాల్సిన పండ్లను కొనుగోలు చేసుకొని తీసుకువెళుతున్నారు. సహజ సిద్దంగా పండే ఫలాలు కావడంతో వీటికి ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.