Coronavirus Updates in Telangana: తెలంగాణలో ఒక్కరోజే రికార్డు.. జీహెచ్‌ఎంసీలో నే అత్యధికంగా 1,658

Coronavirus Updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుంది.

Update: 2020-07-04 01:30 GMT
Representational Image

Coronavirus Updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగిపోతోంది. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,892 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత మూడు రోజులుగా రాష్ట్రంలో వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు పాజిటివ్‌గా తేలింది. ఇంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. తాజా ఫలితాల్లోనూ జీహెచ్‌ఎంసీలో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నట్లుగా వెల్లడైంది. రాష్ట్రం మొత్తంమీద అత్యధికంగా 1,658 కేసులు హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. రంగారెడ్డి (56), మేడ్చల్‌ (44), సంగారెడ్డి (20), వరంగల్‌ గ్రామీణ (41) జిల్లాల్లోనూ వైరస్‌ విజృంభిస్తోంది.

మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 20,462కు పెరిగింది. శుక్రవారం నాటి ఫలితాల్లో 24 జిల్లాల్లో పాజిటివ్‌లు గుర్తించారు. అత్యధికంగా 5,965 నమూనాలను పరీక్షించగా, వాటిలో 31.7 శాతం పాజిటివ్‌లు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 1,04,118కి పెరిగింది. ఇందులో 83,656 మందిలో వైరస్‌ లేదని నిర్ధారణ అయింది. కోలుకున్నవారు పది వేల మంది రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌లో 9,984 మంది చికిత్స పొందుతున్నారు. 1,126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 10,195 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కరోనాతో మరో 8 మంది మృతిచెందగా, ఇప్పటి వరకూ మొత్తం కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 283కు పెరిగింది.

కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో ప్రమాణాలు పాటించని ఓ ప్రైవేటు ల్యాబ్‌పై వేటు పడింది. అందులో 3,726 నమూనాలను పరీక్షించగా, 2,672 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. అంటే 71.7 శాతం. ఇంత పెద్దఎత్తున పాజిటివ్‌లే నమోదవడమనేది పరీక్షా విధానంలో లోపాలను తెలియజేస్తోందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.




Tags:    

Similar News