175 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి..

Update: 2020-06-08 06:18 GMT
fish medicine in hyderabad (file photo)

మృగశిర కార్తె వచ్చిందంటే చాలు లక్షల మంది వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. చేప ప్రసాదాన్ని ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ఎదురుచూస్తుంటారు. కానీ వారి ఆశలన్నీ ఈ ఏడాది అడియాశలయ్యాయి. 175 ఏళ్లపాటు ఆస్తమా రోగులకు ఆపన్నహస్తంగా ఉంటూ నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా మొట్టమొదటి సారి రద్దయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో చేప ప్రసాదం పంపిణీ చేస్తే అక్కడికి తరలి వచ్చిన వేలాది ప్రజలు భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉండదని నిర్వాహకులు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ తెలిపారు. అంతే కాక రాత్రిపూట కర్ఫ్యూ ఇతర కారణాలతో చేప ప్రసాదం అందించడం దుస్సాహసమనే భావనతో చేప ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్నికొద్దిరోజుల క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు.

చేప ప్రసాదం ఎప్పుడు మొదలైంది... ఎన్ని వేదికలు మారింది..

1996 వరకు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ పూర్వీకులు పాతబస్తీ దూద్‌బౌలిలోనే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేవారు. ఆ తరువాత అక్కడ జరిగిన మత కలహాల కారణంగా 1997లో ఈ వేదిక నిజాం కాలేజీ గ్రౌండ్‌కు మార్చారు. ఈ ప్రసాదం స్వీకరించడానికి ఎక్కువ ప్రజలు రావడంతో 1998లో అప్పటి ప్రభుత్వం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను చేపప్రసాదం పంపిణీకి కేటాయించింది. ఆ తరువాత బత్తిని మృగశిర ట్రస్ట్‌కు కేటాయించిన కాటేదాన్‌లోని ఖాళీ స్థలంలో 2012 చేపమందు పంపిణీ జరిగింది. కాగా ఆ ఏడాది తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం 2013లో తిరిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి అనుమతించింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నే చేప ప్రసాదం కొనసాగింది.

మొదట్లో 50 కిలోలే..

చేపమందు ప్రసాదాన్ని మొదట్లో 50 కిలోలతో ప్రారంభించారు. కాగా దీన్ని తీసుకోవడం వలన మంచి ఫలితాలు రావడం వలన ఆదరన పెరిగింది. తరువాత చేప ప్రసాదం 3.5 క్వింటాళ్లకు చేరుకుంది. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ సైతం చేప ప్రసాదం కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతుంటారు.


Tags:    

Similar News