కరోనా భయం: తెలంగాణలో తాజా పరిస్థితి ఇదీ..

Update: 2020-03-03 17:35 GMT
covid 19

కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమయ్యింది. కరోనా వైరస్‌ కొత్త కేసులు నమోదుకాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. కరోనాను ఎదుర్కొనేందుకు 100 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. కరోనాపై అనుమానాల నివృత్తి కోసం 104 నెంబర్ కాల్ చేయాలని సూచించింది. గాంధీ, చెస్ట్, ఫీవర్ , మిలటరీ హాస్పిటల్, ఆస్పత్రులతో పాటు వికారబాద్‌లోని టీబీ శానిటోరియం హాస్పిటల్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్‌లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

పాజిటివ్‌ కేసు వచ్చిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిబ్రవరి 15న దుబాయ్‌ వెళ్లాడని హాంకాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడన్నారు. తర్వాత బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడన్నారు. జ్వరం వచ్చిందని నిన్న గాంధీ ఆస్పత్రికి వచ్చాడని, యువకుడి శాంపిల్స్‌ను పుణె పంపామన్నారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని మంత్రి తెలిపారు. కరోనా వ్యాధి నిర్ధారణకు ముందు అతడితో సన్నిహితంగా ఉన్న 86 మందిని గుర్తించి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 18,224 మందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రికి 445 మంది అనుమానితులు వెళ్లగా 290 మందిని వాళ్ల ఇంటిలోనే పర్యవేక్షణలో ఉంచారు. వారు వైద్య చికిత్సకు కోలుకోవడంతో వారిలో కరోనా వైరస్ లేదని నిర్ధారించారు. మిగిలిన 155 మందికి కరోనా లక్షణాలు ఉండడంతో... వారి శాంపిల్స్ సేకరించి చేసి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అయితే వారిలో 118 మందికి నెగెటివ్ తేలగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. మరో 36 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. 

Tags:    

Similar News