Jagitial: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ప్రాణం తీసిన వివాహేతర బంధం: జగిత్యాల బైపాస్ రోడ్డులో యువకుడి దారుణ హత్య!
Jagitial: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం పట్టపగలే ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Jagitial: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం పట్టపగలే ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమ పేరుతో తన భార్యను తీసుకెళ్లిపోయాడన్న కోపంతో, భర్త తన బంధువులతో కలిసి సదరు యువకుడిని కర్రలతో కొట్టి చంపాడు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. పారిపోయిన జంట:
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరె విశ్వనాథ్ (30)కు, వడ్డెరకాలనీకి చెందిన లక్ష్మికి తొమ్మిది నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. లక్ష్మికి అప్పటికే గంగాధర్‌తో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశ్వనాథ్‌తో పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి ఇల్లు వదిలి పారిపోయారు. అప్పట్లో పోలీసులు వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి లక్ష్మిని భర్తకు అప్పగించారు. అయినప్పటికీ, భర్తతో ఉండటం ఇష్టం లేని లక్ష్మి మళ్లీ విశ్వనాథ్ వద్దకు వచ్చి శ్రీరాంనగర్‌లో సహజీవనం చేస్తోంది.
దర్శనం ముగించుకుని వస్తుండగా దాడి:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం విశ్వనాథ్, లక్ష్మి కలిసి పెంబట్ల కోనాపూర్ దుబ్బ రాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని తిరిగి జగిత్యాల చేరుకుని బైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా.. లక్ష్మి భర్త గంగాధర్ తన బంధువులతో కలిసి వారిని అడ్డుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం కర్రలతో విశ్వనాథ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఆస్పత్రికి తరలించేలోపే మృతి:
తలకు తీవ్రగాయాలు కావడంతో విశ్వనాథ్ రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ దాడిలో లక్ష్మికి కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసుల విచారణ:
సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ కరుణాకర్ పరిశీలించారు. మృతుడి తండ్రి బోరె చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర్ మరియు అతని బంధువులపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, పట్టపగలు జరిగిన ఈ హత్యపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు.