నేడు వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: *మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ‌్యమంత్రి శ్రీకారం *నూతన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

Update: 2022-03-08 00:53 GMT

నేడు వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: దేశ రాజకీయాలవైపు వెళ్తానంటున్న కేసీఆర్‌ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలవైపు అడుగులేస్తున్నారా..? వనపర్తి జిల్లాలో ఇవాళ జరగనున్న బహిరంగ సభ అందుకు వేదిక కాబోతుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ముంబై, ఢిల్లీ పర్యటనల అనంతరం రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో జరిగే కేసీఆర్ మొదటి బహిరంగ సభలో ఈ పర్యటన విశేషాలను వెల్లడించే అవకాశం ఉందన్న ఊహాగానాలతో వనపర్తి సభకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సీఎం కేసీఆర్ వనపర్తిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట చిట్యాల సమీపంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆతర్వాత వనపర్తి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రిబ్బెన్ కటింగ్ చేస్తారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు కేసీఆర్. ఇక భోజానాంతరం కర్నెతండా, ఎత్తిపోతల, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధన కేంద్రం శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారు.

ఇక ఎన్నడూ లేని విధంగా ఈరోజటి సీఎం కేసీఆర్ సభకు ప్రత్యేకత చోటుచేసుకుంది. ముఖ్యంగా ఇటీవల తాను చేసిన ఢిల్లీ, ముంబై పర్యటనల గురించే కాకుండా దేశ రాజకీయాలపై ఈ సభలో ప్రస్తావించే అవకాశం ఉందని ఆపార్టీ నేతలే చెబుతున్నారు.మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Tags:    

Similar News