Corona Updates: కరోనా తో వనదుర్గా భవాని ఆలయం మూసివేత
Corona Updates: ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) కరోనా వైరస్ బారిన పడ్డారు
Edupayala Vana Durga Bhavani Temple (ఫోటో: ది హన్స్ ఇండియా)
Corona Updates: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తెలంగాణ లో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూ వుండడం ఆందోళన కలిగిస్తోంది. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) కరోనా వైరస్ బారిన పడ్డారు. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో అనుమానం వచ్చిన ఆయన మెదక్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మందులు వేసుకుంటున్నా జ్వరం తగ్గక పోవడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెస్ట్ స్కాన్ చేయించుకోవడంతో అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారికి, ఆలయ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) కరోనా బారిన పడటంతో భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడుపాయల ఆలయాన్ని శుక్రవారం నుంచి వారం రోజుల పాటు మూసి వేస్తున్నట్లు మెదక్ ఆర్డీవో సాయిరాం వెల్లడించారు. అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు తదితరాలు యధావిధిగా కొనసాగుతాయని, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశానికి అనుమతి లేదన్నారు. పొడ్చన్‌పల్లి పీహెచ్‌సీ వైద్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఏడుపాయలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.