అనాధలుగా మిగిలారు.. ఎమ్మెల్యే చొరవతో అందరి వారయ్యారు!

Update: 2020-05-14 10:44 GMT

ఆ ఇద్దరు అమ్మాయిలకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఎదుగుతున్న సమయంలో తండ్రి మరణించాడు. కిరాయి ఇంటిని యాజమాని ఖాళీ చేయించాడు. ఎవరూ ఆదుకోకపోవడంతో తండ్రి అంతిమ కార్యక్రమం కోసం వేసిన టెంట్ లోనే నివాసం ఉంటున్నారు. అనాధ అమ్మాయిలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అండగా నిలిచారు. దాతలు, ప్రభుత్వ సహాయంతో బతుకు బాట చూపించారు.

విధి వంచించిన ఇద్దరు అమ్మాయిలు వీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందారు. సొంత ఇల్లు పోవడంతో బతుకు వీధిపాలైంది. ఈ టెంట్ కింద జీవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ లోని కట్నాపల్లి గ్రామనికి చెందిన సమత, మమత అనే ఇద్దరు ఆడపిల్లలు. వీరి తల్లి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి లేని పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి 13 రోజుల క్రితం మరణించాడు. తల్లిదండ్రుల మృతితో ఈ ఇద్దరు బాలికలు అనాధలయ్యారు. తండ్రి మృతి చెందిన తర్వాత సమత, మమతలను కిరాయి ఇంటి నుంచి ఖాళీ చేయించాడు యాజమాని. సమత, మమతల కుటుంబానికి చెందిన కొద్దిపాటి స్థలంలో టెంట్ వేయించి వారి తండ్రి అంత్యక్రియలను గ్రామస్తులు నిర్వహించారు. ఇల్లు లేకపోవడంతో అదే టెంట్ లో బాలికలు నివాసం ఉంటున్నారు

సమత, మమతల దీనగాథ స్థానిక ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ దృష్టికి వచ్చింది. కట్నాపల్లి కి వచ్చి 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. దాతలు ముందుకు వచ్చి అనాధ బాలికలకు అండగా నిలవాలని కోరగా, పలువురు స్పందించారు. సమత, మమతల పేరిట తీయించిన బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు జమా అయ్యాయి. దాతలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

అనాథ బాలికలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందజేయాలని ఎమ్మెల్యే సుంకె రశిశంకర్ కు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి కోరారు. పెద్దమ్మాయి సమతకు మైనార్టీ స్కూల్ లో ఉపాధి కల్పించారు. చిన్నమ్మాయి మమతకు కేజీబీవీ స్కూల్ లో ఏడో తరగతిలో చేర్పించారు. ముఖ్దూంపేటలో డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయించారు ఎమ్మెల్యే. అనాథ బాలికల పెళ్లి బాధ్యత కూడా తాను తీసుకుంటానని అని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అభయం ఇచ్చారు. వివాహానికి ఆర్థిక సాయం చేయడంతోపాటు ఓ తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తాను అని చెబుతున్నారు. ఆపదలో ఉన్న సమత, మమతలను ఆదుకున్న ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ తో పాటు అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపగా, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News