Charges Hike: త్వరలో తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగే ఛాన్స్

Charges Hike: రెండు శాఖలపై సీఎం కేసీఆర్ రివ్యూ

Update: 2021-09-22 03:10 GMT

ఆర్టీసీ మరియు ఎలక్ట్రిసిటీ చార్జీలు పెరిగే అవకాశం (ఫైల్ ఇమేజ్)

Charges Hike: త్వరలో తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‍ఛార్జీలు పెంచే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని రవాణా, విద్యుత్ శాఖ మంత్రులు, అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆర్టీసీ, విద్యుత్‌ శాఖలపై సమీక్షించారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, రవాణా, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛార్జీల పెంపుదలపై చర్చించారు. ఆర్టీసీని పటిష్ఠ పరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని, గాడిలో పడుతోందనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా తిరిగి నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం అన్నారు.

ఇక ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిందేనని మంత్రులు అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు సజ్జనార్‌, ప్రభాకర్‌రావు అన్నారు. కరోనా సంక్షోభంతోపాటు డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీ పరిస్థితి దిగజారిందని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో డీజిల్‌ ధర లీటరుకు భారీగా పెరగడం వల్ల 550 కోట్ల మేర, టైర్లు, ట్యూబులు వంటి విడిభాగాల ధరల వల్ల మరో 50 కోట్ల మేర కలిసి మొత్తం మీద 600 కోట్ల భారం పడుతోంది. లాక్‌డౌన్ తో 3వేల కోట్ల మేరకు నష్టపోయింది. హైదరాబాద్‌ పరిధిలోనే నెలకు 90 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ కష్టకాలంలో ఛార్జీలు పెంచక తప్పదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020 మార్చిలోనే ఛార్జీలను పెంచుతామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. ఆరేళ్లుగా ఛార్జీలను సవరించలేదు. ఇప్పుడు పెంచక తప్పదని జగదీశ్‌రెడ్డి, ప్రభాకర్‌రావు సీఎంకు విన్నవించారు. సమీక్ష సందర్భంగా ఆర్టీసీ పార్సిల్‌ సేవలు విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్‌ అధికారులను అభినందించినట్లు తెలిసింది.

ఆర్టీసీ ప్రయాణికులపై త్వరలో ఛార్జీల పెంపు భారం పడనుంది. చివరిసారిగా 2019 డిసెంబరులో ప్రభుత్వం ఛార్జీలను సవరించింది. కనీస ఛార్జీని 5 రూపాయల నుంచి 10 రూపాయలకు చేరుస్తూ మొత్తంగా ఛార్జీలను 20 శాతం వరకు పెంచింది. దాంతో రోజువారీ ఆదాయం 4 కోట్ల మేరకు పెరిగింది. అంతలోనే కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభం కావటంతో బస్సులు మూలకు చేరాయి.

మహమ్మారి తగ్గుముఖం పట్టటంతో ఇప్పుడిప్పుడే ఆదాయం కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. కొద్దిరోజుల కిందటే రోజువారీ ఆదాయం 13 కోట్లు దాటింది. అయినా డీజిల్‌, విడిభాగాల ధరల పెరుగుదల కారణంగా ఈసారి కనీసం 10 నుంచి 20 శాతం మేరకు ఛార్జీలు పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. 20 శాతం పెంచితే రోజువారీ ఆదాయం 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు పెరుగుతుందని అంచనా. ఏడాదిలో కనీసం 175 రోజుల పాటు ఆ మేరకు ఆదాయం వస్తే వెయ్యి కోట్ల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News