KCR: దేదీప్యమానంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
KCR: విభేదాలు, విమర్శలు పక్కనపెట్టి గ్రౌండ్ వర్క్ చేయాలి
KCR: దేదీప్యమానంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
KCR: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయన్న ఆయన.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులం, మతంపై ఏ పార్టీ గెలవదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడడమే బీఆర్ఎస్ విజయ రహస్యమని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ శాతం మళ్లీ సీట్లు వస్తాయని వివరించారు.
బీఆర్ఎస్‌ఎల్పీలలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలువురు ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ అయ్యారు. ప్రజల్లోకి వెళ్లకుండా పై పై ప్రచారాలు పక్కన పెట్టాలని సూచించారు. పలుసార్లు సూచనలు చేసినా.. వైఖరి మారకుంటే టికెట్లు ఇవ్వడం కుదరదని ఆయన తేల్చిచెప్పేశారు. అధిష్టానం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను గమనిస్తూనే ఉందన్నారు.
హైదరాబాద్ పరిధిలో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన మేర జరగలేదని, విభేదాలు, విమర్శలు పక్కనపెట్టి గ్రౌండ్ వర్క్ చేయాలని సూచించారు గులాబీ బాస్. పథకాల ప్రచారంపై ఫోకస్ చేయాలని, ఎన్నికల సమయానికి లోపాలను సరిదిద్దుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక.. సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయన్న కేసీఆర్.. కర్ణాటక ఫలితాలు పట్టించుకోవద్దని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరపాలని అన్నారు సీఎం కేసీఆర్.