BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్: కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఆశిష్ షెలార్ నియామకం!
BJP: తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజేపీ భారీ కసరత్తు. ఇన్‌చార్జ్‌గా ఆశిష్ షెలార్, కో-ఇన్‌చార్జ్‌లుగా అశోక్ పర్ణమి, రేఖాశర్మ నియామకం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
BJP: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, కో- ఇన్‌చార్జ్‌లుగా బీజేపీ రాజస్తాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణమి, రాజ్యసభ ఎంపీ రేఖాశర్మను నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదం మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు తెలిపారు.
ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే కేరళ, గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ ఇన్‌చార్జ్, కో ఇన్‌చార్జ్‌లను, చండీగఢ్ మేయర్ ఎన్నికలకు పరిశీలకులను నియమించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కో ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి శోభా కర్లందాజే, గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా రాం మాధవ్, కో- ఇన్ చార్జ్‌లుగా సతీశ్ పూనియా, సంజయ్ ఉపాధ్యాయ్, చంఢీగడ్ మేయర్ ఎన్నికల అబ్జర్వర్‌గా వినోద్ తావ్డేకు బాధ్యతలు అప్పగించారు.