ఢిల్లీ అల్లర్లపై ప్రధాని మౌనం వీడాలి

Update: 2020-03-01 15:45 GMT
Asaduddin Owaisi File Photo

ఇటీవల ఢిల్లీ జరిగిన అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. అల్లర్లలో నష్టపోయిన బాధిత ప్రజలను పరామర్శించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన అల్లర్లను మారణహోమంగా అభివర్ణించారు. ఎన్డీయే నేతలు దేశ రాజధానిని కదిపివేసిన అల్లర్లపై మౌనం దాల్చడాన్ని అసదుద్దీన్‌ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ తన అధికార నివాసానికి అతి సమీపంలో జరిగిన ఢిల్లీ హింసాకాండపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని తాను అడగదల్చుకున్నానని అన్నారు.

2002లో గుజరాత్‌లో జరిగిన మారణహోమంతో ప్రధాని నరేంద్రమోదీ గుణపాఠం నేర్చుకుంటారని తాను అనుకున్నానని, అయితే 2020లో ఢిల్లీలో ఇది చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ అల్లర్లలో 40 మందికి పైగా మృతిచెందారని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. హింసాకాండతో దద్దరిల్లిన శివ్‌ విహార్‌ను సందర్శించాలని కోరారు. ఈ ఘటనలో మరణించిన వారంతా భారతీయులేనని ‍ఆయన అన్నారు. బీజేపీ నేతల ప్రకటనలతోనే హింస ప్రజ‍్వరిల్లిందని చెప్పారు.

ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో 40మందిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనకి పాల్పడిన వారిలో దోషులుగా తేలితే వారికి కఠినమైన శిక్ష విధించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  

Tags:    

Similar News