Asaduddin Owaisi: ఆధార్‌ నోటీసులపై అసదుద్దీన్‌ ఫైర్‌..

Update: 2020-02-19 08:36 GMT

తప్పుడు పత్రాలతో ఆధార్‌ పొందారనే విషయంపై హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయం పై ఏఐఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉడాయ్‌, తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో ఆధార్‌ కార్డును చూపమని అడగటం విరమించుకోవాలని అన్నారు. ఈ విధంగా చేయడం చట్టబద్దం కాదని, అందుకు అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి ఏఐఎంఐఎం చీఫ్‌ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా ఈ నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను ఉడాయ్‌ సస్పెండ్‌ చేయాలని మరో పోస్టులో కోరారు.

అంతే కాక 127మందికి పంపించిన నోటీసులో పౌరసత్వ వెరిఫికేషన్‌ అనే పదాన్ని ఉపయోగించారని, ఆధార్‌ వ్యాలిడిటీ గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ఎరికైతే ఉడాయ్‌ నోటీసులు పంపించారో వారిలో ఎంతమంది ముస్లింలు, దళితులు ఉన్నారో తెలపాలని ఆయన ప్రశ్నించారు. కక్షపూరింతంగా కొంతమందికి ఆధార్‌ సంస్థ నోటీసులు పంపించి తన అధికారాలను దుర్వినియోగం చేసిందని తెలిపారు. సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాతపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని వారు నిరూపించుకోకపోయినా వారి ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించడం సబబు కాదని అన్నారు

కాగా హైదరాబాద్ తలాబ్ కట్టకి చెందిన మహమ్మద్ సత్తార్ ఖాన్ ‌కు ఆధార్ వ్యవస్థ నుంచి నోటీసులందాయి. విచారణకు వచ్చేటప్పుడు పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాలని, ఒకవేళ భారత జాతీయుడు కాకపోతే భారతదేశంలోకి చట్టబద్ధంగానే అడుగుపెట్టినట్లు నిరూపించుకునే డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించారు.  ఒకవేళ ఈ విచారణకు హాజరు కాకపోయినా, పౌరసత్వం నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోయినా ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎలాంటి ఆధారాలు లేవని భావించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని వెల్లడించారు

 



Tags:    

Similar News