ఫలించిన చర్చలు..ప్రారంభ‌మైన ఆరోగ్యశ్రీ సేవలు

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్‌ జరపిన చర్చలు సఫలమయ్యాయి. ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి.

Update: 2019-08-21 05:57 GMT

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్‌ జరపిన చర్చలు సఫలమయ్యాయి. ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు. ఇకపై ప్రతినెలా ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు కమిటీ వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సమ్మెను విరమిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌తో మంత్రి ఈటల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో ఆరోగ్యశ్రీ సమ్మెను విరమించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోషియేషన్ అంగీకరించింది. నిన్నటివరకు 360కోట్ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం మరో వందకోట్లు చెల్లించేందుకు సర్కారు హామీ ఇచ్చింది. అలాగే మూడ్రోజుల్లో మరో 60కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గొప్పగా అమలవుతోందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 85లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వంద రెట్లు బాగా అమలవుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ కేవలం 25లక్షల కుటుంబాలకు అమలుచేస్తుంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ 85లక్షల ఫ్యామిలీలకు అందిస్తున్నట్లు ఈటల అన్నారు. ఇప్పటివరకు 520కోట్లు చెల్లించామని, త్వరలో ప్రతినెలా కొంతమేర చెల్లించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు త్వరలో కమిటీ వేస్తామని మంత్రి ఈటెల హామీ ఇవ్వడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అసోషియేషన్ సమ్మె విరమణకు ఒప్పుకున్నాయి. ఆరోగ్యశ్రీ ఎంవోయూ సవరణకు కూడా ప్రభుత్వం అంగీకరించిందని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోషియేషన్ నేతలు తెలిపారు. ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి ఈటల హామీ ఇవ్వడంతో ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. 

Tags:    

Similar News