తెలంగాణలో ఈదురు గాలులతో భారీ వర్షం.... కొట్టుకుపోయిన ధాన్యం

తెలంగాణలో పలు చోట్ల ఈదురుగాలులు

Update: 2024-05-08 02:49 GMT

తెలంగాణలో ఈదురు గాలులతో భారీ వర్షం.... కొట్టుకుపోయిన ధాన్యం

Telangana: భానుడి భగభగలతో అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమరం భీంఆసిఫాబాద్, ములుగు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ తదితర జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల వడగండ్లతో కూడిన వర్షం కురిసింది,. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. . ఈదురు గాలుల తాకిడికి మామిడి కాయాలు నేల రాలాయి. కోతకు వచ్చిన పంట దెబ్బతిన్నది.

హైదరాబాద్ సిటీలోనూ భారీ వర్షం, ఈదురు గాలులు అతలాకుతలం చేశాయి. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణుడి రాక ఉపశమనం కల్గించింది. ఒక్క సారిగా వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. గంటకు పైగా కురిసి వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల విద్యుత్ సిబ్బంది ముందస్తుగా కరెంట్ సరఫరా నిలిపి వేశారు.

తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో అధికారులతో ఫోన్ లో సంప్రదించారు. మున్సిపల్, పోలీసు,విద్యుత్ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులకు సూచన చేశారు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యల్లో అధికారులకు అండగా నిలువాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ సూచించారు. 

Tags:    

Similar News