Wipro AI MRI Machine: క్యాన్సర్ నిర్ధారణలో AI .. కేవలం 30 నిమిషాల్లోనే రిపోర్ట్స్!
Wipro AI MRI Machine: క్యాన్సర్ నిర్ధారణలో AI .. కేవలం 30 నిమిషాల్లోనే రిపోర్ట్స్! క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే, ప్రాణాలను కాపాడే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
Wipro AI MRI Machine: క్యాన్సర్ నిర్ధారణలో AI .. కేవలం 30 నిమిషాల్లోనే రిపోర్ట్స్!
క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే, ప్రాణాలను కాపాడే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో, విప్రో కంపెనీ ఒక అద్భుతమైన AI ఆధారిత ఎంఆర్ఐ (MRI) యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా క్యాన్సర్ నిర్ధారణకు రోజులు పట్టే చోట, ఈ కొత్త టెక్నాలజీతో కేవలం అరగంటలోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. భారతదేశంలోనే తయారైన ఈ మొదటి AI ఆధారిత ఎంఆర్ఐ మెషిన్ గురించి విప్రో టెక్నికల్ ఆఫీసర్ సంధ్య అరుణ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అవి ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
విప్రో టెక్నికల్ ఆఫీసర్ సంధ్య అరుణ్ ఎంఆర్ఐ మెషిన్ వివరిస్తూ.. ఈ యంత్రానికి నాలుగు ప్రత్యేకమైన రోబోటిక్ చేతులు ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రతి భాగాన్ని, ముఖ్యంగా పొత్తికడుపు వంటి క్లిష్టమైన భాగాలను చాలా క్షుణ్ణంగా స్కాన్ చేస్తాయి. స్కానింగ్ జరుగుతున్నప్పుడే, లోపల పరిస్థితి ఎలా ఉందో స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. శరీరంలో ఎక్కడైనా గడ్డలు లేదా క్యాన్సర్ కణాలు ఉన్నాయా అనేది AI వెంటనే గుర్తించి రిపోర్ట్ ఇస్తుంది. ఈ మెషిన్ వల్ల స్కానింగ్ సమయం 37% తగ్గుతుంది. అంటే తక్కువ సమయంలోనే మరింత స్పష్టమైన రిపోర్టులు వస్తాయి. ఈ యంత్రంలో ఉపయోగించే హీలియం గ్యాస్ వినియోగం కూడా 75% వరకు తగ్గుతుంది. దీనివల్ల పరీక్షలు మరింత వేగంగా, నమ్మదగ్గవిగా మారుతాయి.
రోగులకు కలిగే ప్రయోజనం ఏంటంటే..
సాధారణంగా టెస్టులు చేయించుకున్నాక రిపోర్టుల కోసం రోగులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తుంటారు. కానీ ఈ టెక్నాలజీతో కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే క్యాన్సర్ ఉందో లేదో ప్రాథమికంగా తెలిసిపోతుంది. దీనివల్ల వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ పెరగడం వల్ల వైద్యం సామాన్యులకు మరింత వేగంగా, కచ్చితంగా అందుతోంది. ప్రాణాంతక వ్యాధుల భయాన్ని పోగొట్టడంలో ఇలాంటి ఆవిష్కరణలు నిజంగా మైలురాళ్లు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.