AI Impact Summit 2026: సిలికాన్ వ్యాలీ మొనగాళ్లు, ప్రపంచ నాయకులను ఒక్కచోట చేర్చబోతున్న AI సమ్మిట్!
న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు AI ఇంపాక్ట్ సమ్మిట్ 12 రకాల AI నమూనాలను ఆవిష్కరించనున్న ఇండియా..
AI Impact Summit 2026: సిలికాన్ వ్యాలీ మొనగాళ్లు, ప్రపంచ నాయకులను ఒక్కచోట చేర్చబోతున్న AI సమ్మిట్!
వచ్చే వారం నుంచి యావత్ ప్రపంచం దృష్టి న్యూఢిల్లీ వైపు మళ్ళబోతోంది. టెక్నాలజీ ప్రపంచంలో విప్లవం సృష్టిస్తున్న 'కృత్రిమ మేధ' (Artificial Intelligence) భవిష్యత్తును నిర్ణయించే భారీ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. "AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026" పేరుతో భారత్‌లో జరగనున్న ఈ వేడుకలో ప్రపంచ దేశాల అధ్యక్షులు, సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు ఒక్కచోట చేరబోతున్నారు.
భారత్‌కు క్యూ కడుతున్న ప్రపంచ నాయకులు వీరే..
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే ఈ సదస్సులో గతంలో ఎన్నడూ లేని విధంగా శక్తివంతమైన నాయకులు పాల్గొంటున్నారు:
* భారత్‌తో టెక్నాలజీ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి వస్తున్నారు.
* బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ఏకంగా 200 మంది వ్యాపారవేత్తల బృందంతో కలిసి భారత్‌కు రాబోతున్నారు.
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
వీరితో పాటు ఫిన్లాండ్, స్లోవేకియా, స్పెయిన్, శ్రీలంక, నెదర్లాండ్స్ వంటి దాదాపు 45 దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారు.
సిలికాన్ వ్యాలీ దిగ్గజాల సందడి..
AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో పాల్గొనడానికి అగ్రరాజ్యం అమెరికా నుంచి భారీ ప్రతినిధి బృందం వస్తోంది. అడోబ్ (Adobe) సీఈఓ శంతను నారాయణ్, ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రమణ్యం ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ బ్రాడ్ స్మిత్ వంటి 120 మందికి పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ కూడా అమెరికా అధికారిక ప్రతినిధిగా వస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "AI ఆవిష్కరణలో అమెరికా గోల్డ్ స్టాండర్డ్ సెట్ చేస్తోంది.. దాన్ని భాగస్వాములతో పంచుకుంటాం" అని ప్రకటించారు.
ఈ సదస్సులో భారత్ తన సొంత 'AI' శక్తిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. IndiaAI మిషన్ కింద మన దేశానికే ప్రత్యేకమైన 12 రకాల AI నమూనాలను ఆవిష్కరిస్తున్నారు. వీటిలో
* 22 భారతీయ భాషలు: మన దేశంలోని వివిధ భాషలకు అనుగుణంగా పనిచేసే AI ఇంజిన్లు.
* వ్యవసాయం & ఆరోగ్యం: రైతులకు, సామాన్యులకు ఉపయోగపడేలా ఐఐటీ బాంబే, ఇతర స్టార్టప్‌లు రూపొందించిన 'భారత్‌జెన్' వంటి టూల్స్.
* 70,000 చదరపు మీటర్ల ఎక్స్‌పో: AI ఎలా మన జీవితాలను మారుస్తుందో కళ్ళకు కట్టేలా భారీ ప్రదర్శన.
80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, వేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌లతో భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఒక 'టెక్నాలజీ వారధి'గా మారింది. 2027 నాటికి మన దేశ AI మార్కెట్ 17 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ న్యూఢిల్లీ సదస్సు కేవలం చర్చల కోసం కాదు.. ప్రపంచాన్ని మరింత సమానంగా, నైతికంగా మార్చే ఒక కొత్త అధ్యాయంగా మారబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.