Suresh Raina : అక్రమ బెట్టింగ్ యాప్స్ కేసు.. మాజీ క్రికెటర్‌కు ఈడీ సమన్లు, విచారణకు హాజరు
Suresh Raina : భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Suresh Raina : భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో రైనాను విచారించడానికి ఈడీ పిలిచింది. రైనా బుధవారం విచారణకు హాజరు కావచ్చని సమాచారం. అక్రమ బెట్టింగ్ యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఈ సమన్లు జారీ అయ్యాయి. 1xBet అనే బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసినట్లు రైనాపై ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ కేవలం క్రికెటర్లపైనే కాకుండా, బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన సినీ నటులపై కూడా దృష్టి సారించింది. గతంలో, తెలంగాణ పోలీసులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ సహా దాదాపు 25 మంది నటులపై కేసులు నమోదు చేశారు. ఈ విచారణలో రానా, ప్రకాష్ రాజ్ తమ తప్పును అంగీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేయమని హామీ ఇచ్చారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రచారంపై జరుగుతున్న విచారణకు సంబంధించి రానా దగ్గుబాటి సోమవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ కేసులో నటి మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, టీవీ యాంకర్ శ్రీముఖి పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి.
అక్రమ బెట్టింగ్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 2023-2024 మధ్య కాలంలో మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో అనేకమందిని ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, అధికారులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, బఘేల్ ఈ ఆరోపణలను ఖండించారు. ఇది రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. 2025 మొదటి మూడు నెలల్లోనే అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లకు 1.6 బిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ మార్కెట్ విలువ సుమారు $100 మిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ అక్రమ లావాదేవీలను నిరోధించడానికి ఈడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.