Shoaib Akhtar : మావాళ్లు గెలవడం కోసం ఆడరు.. పాక్ టీం పై షోయబ్ అక్తర్ విమర్శలు
Shoaib Akhtar : మావాళ్లు గెలవడం కోసం ఆడరు.. పాక్ టీం పై షోయబ్ అక్తర్ విమర్శలు
Shoaib Akhtar : మావాళ్లు గెలవడం కోసం ఆడరు.. పాక్ టీం పై షోయబ్ అక్తర్ విమర్శలు
Shoaib Akhtar : వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్, వన్డే సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది. సిరీస్ ఓడిపోవడం కంటే, ఆఖరి మ్యాచ్‌లో జట్టు ప్రదర్శించిన తీరు అభిమానులు, మాజీ క్రికెటర్లను తీవ్రంగా నిరాశపరిచింది. చివరి వన్డేలో పాకిస్తాన్ కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యి 202 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ ప్రదర్శనపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అఖ్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు అన్ని చోట్లా రావల్పిండి లాంటి పిచ్‌లు దొరకవు' అంటూ సొంత జట్టుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వెస్టిండీస్, పాకిస్తాన్ మధ్య జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యి చతికిలపడింది. జట్టు ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల వైఫల్యమే. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్లు సామ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. వీరితో పాటు సీనియర్ ఆటగాడు బాబర్ ఆజం కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. టాప్-4లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ కావడం జట్టు స్థాయిని ప్రశ్నార్థకం చేసింది.
పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై గేమ్ ఆన్ హై కార్యక్రమంలో మాట్లాడిన షోయెబ్ అఖ్తర్.. గతంలో మా జట్టులో అటాకింగ్ టాలెంట్ ఉండేది, దానికి తగ్గట్టుగానే ఆడేవాళ్ళం. ఒక్కరిపై ఆధారపడకుండా అందరూ తమ పాత్రను చక్కగా పోషించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత 10-15 ఏళ్ల నుంచి అందరూ తమ కోసం మాత్రమే ఆడుతున్నారు. తమ సగటుల కోసం ఆడుతున్నారు. దేశం కోసం మ్యాచ్ గెలవాలనే ఆలోచన ఉండాలి. మనం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అందరూ ఆధునిక క్రికెట్‌కు తగ్గట్టుగా ఆడాలి. ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమేనా?" అంటూ మండిపడ్డారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత కూడా వన్డే సిరీస్‌లలో వారి ప్రదర్శన మెరుగుపడలేదు. న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ వన్డే సిరీస్‌ను 3-0తో ఓడిపోయింది. ఇప్పుడు వెస్టిండీస్‌పై కూడా 2-1తో ఓటమి పాలైంది. బంతి కొద్దిగా టర్న్ అయితే చాలు, బ్యాట్స్‌మెన్లు ఇబ్బందులు పడుతున్నారని అఖ్తర్ ఆందోళన వ్యక్తం చేశారు.