SA20 League 2025 : ఇది అన్యాయం సామీ..వీడియో గేమ్ ఆడుతున్నారా? 6 బంతులో 6 సిక్సులు..28 బంతుల్లో 83 పరుగులు
SA20 League 2025 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ఊహించని విధ్వంసం చోటుచేసుకుంది. 2025 ఏడాది ఆఖరి రోజున జరిగిన మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ బౌలర్ల పని పట్టారు.
SA20 League 2025 : ఇది అన్యాయం సామీ..వీడియో గేమ్ ఆడుతున్నారా? 6 బంతులో 6 సిక్సులు..28 బంతుల్లో 83 పరుగులు
SA20 League 2025 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ఊహించని విధ్వంసం చోటుచేసుకుంది. 2025 ఏడాది ఆఖరి రోజున జరిగిన మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ బౌలర్ల పని పట్టారు. ప్రిటోరియా క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ మధ్య జరిగిన ఈ పోరులో సిక్సర్ల వర్షం కురిసింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బంతిని 11 సార్లు మైదానం వెలుపలికి పంపారంటే పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి ధాటికి ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ బౌలర్లు నీళ్లు తాగాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లోనే అత్యంత హైలైట్ అంశం ఏమిటంటే.. వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు నమోదు కావడం. అయితే ఇది ఒక్క ఓవర్లో జరిగింది కాదు, రెండు ఓవర్ల కలయికలో జరిగింది. ప్రిటోరియా ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి రెండు బంతులకు డెవాల్డ్ బ్రెవిస్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 19వ ఓవర్ వేయడానికి వచ్చిన ప్రిటోరియస్ తొలి నాలుగు బంతులను షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ స్టాండ్స్‌లోకి పంపాడు. ఇలా ఇద్దరు కలిసి వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలచడం చూసి స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. వీరిద్దరి మధ్య సిక్సర్లు కొట్టే పోటీ ఏమైనా జరుగుతుందా అన్నట్లుగా సాగింది ఈ విన్యాసం.
వీరిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ చాలా చిన్నదే అయినా, అది సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. డెవాల్డ్ బ్రెవిస్ 276.92 స్ట్రైక్ రేట్‌తో కేవలం 13 బంతుల్లో 36 పరుగులు (4 సిక్సర్లు, 1 ఫోర్) చేశాడు. ఇక రూథర్‌ఫోర్డ్ మరో అడుగు ముందుకు వేసి 313.33 స్ట్రైక్ రేట్‌తో కేవలం 15 బంతుల్లోనే 47 పరుగులు (6 సిక్సర్లు) పిండుకున్నాడు. ఇద్దరు కలిసి ఎదుర్కొన్నది కేవలం 28 బంతులు మాత్రమే, కానీ స్కోరు బోర్డుపై 83 పరుగులు చేరాయి. ఇందులో మొత్తం 10 సిక్సర్లు ఉండటం విశేషం.
ఈ మెరుపు ఇన్నింగ్స్‌ల పుణ్యమా అని ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. 221 పరుగుల హిమాలయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. ప్రిటోరియా బౌలర్ల ధాటికి 135 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా ప్రిటోరియా క్యాపిటల్స్ 85 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 2025 ముగింపు వేళ సౌత్ ఆఫ్రికా క్రికెట్ అభిమానులకు ఇదొక మరుపురాని మ్యాచ్‌గా మిగిలిపోయింది.