IND vs NZ : 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కివీస్..సిరీస్ కోల్పోయిన భారత్

IND vs NZ : ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది.

Update: 2026-01-19 04:30 GMT

IND vs NZ : 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కివీస్..సిరీస్ కోల్పోయిన భారత్

IND vs NZ: ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి, సరికొత్త చరిత్ర సృష్టించింది. 37 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని కివీస్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కింగ్ కోహ్లీ వీరోచిత సెంచరీ చేసినా, మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ఆదివారం జరిగిన ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలో భారత బౌలర్లు కివీస్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. కేవలం 5 పరుగులకే 2 వికెట్లు, 58 పరుగుల వద్ద 3వ వికెట్ తీసి భారత్ పట్టు బిగించింది. కానీ, డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) జోడీ సీన్‌ను పూర్తిగా మార్చేసింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ఇండియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. మిచెల్ వరుసగా రెండో సెంచరీ బాదగా, ఫిలిప్స్ మెరుపు శతకంతో కదం తొక్కారు. చివర్లో బ్రేస్‌వెల్ మెరుపులతో న్యూజిలాండ్ 8 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది.

338 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ కివీస్ స్పీడ్ స్టర్ల ధాటికి కుప్పకూలింది. రోహిత్ శర్మ (11), గిల్ (23), అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ (124) తన వన్డే కెరీర్‌లో 54వ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి (53), బౌలర్ హర్షిత్ రాణా (52) అద్భుత హాఫ్ సెంచరీలతో పోరాడారు. కోహ్లీ క్రీజులో ఉన్నంత వరకు భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు.

విజయానికి చేరువవుతున్న తరుణంలో హర్షిత్ రాణా, ఆ వెంటనే కోహ్లీ అవుట్ అవ్వడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివరకు టీమ్ ఇండియా 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్, జాక్ ఫోక్స్ చెరో 3 వికెట్లు తీసి భారత్ వెన్ను విరిచారు. టెస్టుల్లో భారత్‌ను ఓడించిన ఊపులోనే ఉన్న కివీస్, ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా 2-1తో గెలుచుకుని భారత గడ్డపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

Tags:    

Similar News