IND vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్..
IND vs NZ: 70పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ
IND vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్..
IND vs NZ: వరల్డ్ కప్‌లో టీమిండియా అదరగొట్టింది. కప్పు కొట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. వరుసగా పదో మ్యాచ్‌లో ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లో సత్తా చాటింది. 70 పరుగుల తేడాతో కివీస్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటములకు భారత్ బదులు తీర్చుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మూడోసారి ఫైనల్ చేరుదామనుకున్న న్యూజిలాండ్ ఆశలు ఆవిరయ్యాయి.
398 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ప్రపంచ కప్ ప్రయాణాన్ని ముగించింది. మహ్మద్ షమీ ఏడు వికెట్లు తీసి కీవిస్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. షమీ దెబ్బకు న్యూజిలాండ్ విలవిలలాడింది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసి ఇండియా విజయంలో భాగస్వాములయ్యారు.
కివీస్ బ్యాటర్లలో దారిల్ మిచెల్ 134 పరుగులు, కేన్ విలియమ్సన్ 69, గ్లెన్ పిలిప్స్ 41 రాణించారు. 39 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను మిచెల్, మిలియమ్సన్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ 117 , శ్రేయస్ అయ్యర్ 105 రన్స్‌తో శతకాలు కొట్టారు. శుభమన్ గిల్ 80, కెఎల్ రాహుల్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు తీసినా... వంద పరుగులు ఇచ్చాడు. ట్రెంట్ బోల్ట్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో భారత్ వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లోకి ప్రవేశించింది. గురువారం కోల్‌తా వేదికగా సౌతాఫ్రికా, ఆసీస్ మధ్య జరుగబోయే మ్యాచ్‌లో విజేతతో ఈనెల 19న తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. భారత్ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.