Deepti Sharma : సరికొత్త చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ..150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డ్
Deepti Sharma : తిరువనంతపురంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంక మహిళా జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Deepti Sharma : సరికొత్త చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ..150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డ్
Deepti Sharma : తిరువనంతపురంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంక మహిళా జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు ఈ నిర్ణయాన్ని సరైనదిగా నిరూపించారు. ముఖ్యంగా రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 3-0 తో అజేయ ఆధిక్యం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన దీప్తి శర్మ ఒక అరుదైన ఘనతను సాధించింది. ఆమె టీ20 ఇంటర్నేషనల్స్ లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ రికార్డును ఏ భారత పురుష క్రికెటర్ కూడా ఇప్పటివరకు అందుకోలేకపోయాడు. పురుషుల క్రికెట్‌లో భారతదేశం తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ పేరు మీద కేవలం 110 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌గా కెప్టెన్ చమరి అటపట్టు (2 పరుగులు)ను అవుట్ చేసింది దీప్తి శర్మ. ఆ తర్వాత, కవిశ దిల్హారి (20 పరుగులు)ను అవుట్ చేయడం ద్వారా ఆమె తన 150వ టీ20 వికెట్‌ను పూర్తి చేసింది. దీప్తి శర్మ తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి, 4.50 ఎకానమీతో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 3 వికెట్లు తీసిన ఆమె ఖాతాలో ఇప్పుడు 151 టీ20 వికెట్లు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మేగన్ షూట్ తర్వాత 150+ టీ20 వికెట్లు తీసిన రెండవ బౌలర్ దీప్తి శర్మ.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. 113 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, భారత ఓపెనర్ షఫాలీ వర్మ వీరోచిత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేసింది. ఆమె ధాటికి భారత్ కేవలం 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన 1 పరుగుకే అవుట్ కాగా, జెమిమా రోడ్రిగ్స్ (9 పరుగులు) తో కలిసి షఫాలీ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
దీప్తి శర్మ ఇంటర్నేషనల్ కెరీర్
28 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ భారత క్రికెట్ జట్టుకు ఎంతో కీలకం. ఆమె అంతర్జాతీయ రికార్డులు ఈ విధంగా ఉన్నాయి:
టెస్ట్: 5 మ్యాచ్‌లు, 20 వికెట్లు.
వన్డే: 121 మ్యాచ్‌లు, 162 వికెట్లు.
టీ20 : 131 మ్యాచ్‌లు, 151 వికెట్లు.
భారత జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంలో కూడా ఆమె ముఖ్యపాత్ర పోషించింది. ఆ టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికైంది.