Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్‌కు ఏమైంది?8 ఓవర్లలోనే అన్ని పరుగులా!

Arjun Tendulkar : విజయ్ హజారే ట్రోఫీలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

Update: 2026-01-01 03:44 GMT

Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్‌కు ఏమైంది?8 ఓవర్లలోనే అన్ని పరుగులా!

Arjun Tendulkar : విజయ్ హజారే ట్రోఫీలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. తన పాత జట్టు ముంబైపై ప్రతీకారం తీర్చుకుంటాడని ఆశించిన అభిమానులకు అర్జున్ షాక్ ఇచ్చాడు. బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడమే కాకుండా, వికెట్లు తీయడంలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ ముంచుకొస్తున్న వేళ, అర్జున్ ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గోవా, ముంబై జట్ల మధ్య జరిగిన పోరు వన్ సైడెడ్ గా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గోవా బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్‌ బౌలింగ్‌ను సర్ఫరాజ్ చీల్చి చెండాడాడు. అర్జున్ తన కోటాలో వేసిన 8 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, విపరీతమైన రన్ రేట్ ఇచ్చి ముంబై భారీ స్కోరు చేయడంలో పరోక్షంగా సహకరించాడు.

445 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా జట్టు.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అర్జున్ టెండూల్కర్‌ను ఓపెనర్‌గా పంపింది. అర్జున్ తన ఇన్నింగ్స్‌ను ఐదు ఫోర్లతో ధాటిగానే ప్రారంభించినప్పటికీ, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. 27 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరకు గోవా జట్టు 9 వికెట్ల నష్టానికి 357 పరుగులు మాత్రమే చేసి 87 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అర్జున్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలం కావడం గోవా కొంపముంచింది.

ఈ టోర్నీలో అర్జున్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతను ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 1 రన్ చేసి, బౌలింగ్‌లో 6 ఓవర్లకు 58 పరుగులు ఇచ్చాడు. సిక్కింపై జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు చేసి, 9 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి వికెట్ లేకుండా వెనుదిరిగాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ పేరిట 25 వికెట్లు ఉన్నాయి, కానీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఆ గణంకాలు మెరుగుపడేలా కనిపించడం లేదు.

రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం అర్జున్ టెండూల్కర్ తన బేస్ మార్చుకున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన అర్జున్, ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగనున్నాడు. ముంబై జట్టు శార్దూల్ ఠాకూర్‌ను తీసుకుని, ట్రేడింగ్ ద్వారా అర్జున్‌ను లక్నోకు పంపింది. అయితే లక్నో భారీ ఆశలతో అర్జున్‌ను తీసుకున్నప్పటికీ, విజయ్ హజారే ట్రోఫీలో అతని ప్రదర్శన చూస్తుంటే మేనేజ్మెంట్ పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఐపీఎల్ వంటి హై-లెవల్ టోర్నీలో రాణించాలంటే అర్జున్ తన బౌలింగ్ స్పీడు, లైన్ అండ్ లెంగ్త్‌ను వెంటనే సరిదిద్దుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News